22-11-2025 07:38:42 PM
అర్మూర్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ బిల్లులను రద్దు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు ఎం.ముత్తన్న, కోశాధికారి జి.అరవింద్ లు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి కార్మికులు పోరాడి సాధించినటువంటి చట్టాలను గత కొన్ని సంవత్సరాల కిందట నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంకు వచ్చిన తర్వాత లేబర్ కోడ్లును మార్చేసి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి విధంగా నాలుగు లేబర్ కోడ్లును తీసుకురావడం జరిగిందని అన్నారు.
ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మికులు అనేకసార్లు అనేక రకాల పోరాటాలు చేశారని అన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాల బిల్లు పెట్టి ఆమోదించడం సిగ్గు చేటన్నారు. వెంటనే నాలుగు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ ఏరియా నాయకులు ఎండి నజీర్, తూర్పాటి శ్రీనివాస్, జి.పద్మ , సునీత, లక్ష్మి, నిఖిల్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.