20-08-2025 01:47:45 AM
- బండ్లగూడలో ఇద్దరు, అంబర్‌పేటలో ఒకరు
- కామారెడ్డి జిల్లాలో మరో యువకుడు
- హైదరాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలో మూడు ఘటనలు..8 మంది మృతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 19 (విజయక్రాంతి): వినాయకుడి విగ్రహాలను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మూడు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ జిల్లా పాతబస్తీ బండ్లగూడలో సోమవారం సాయంత్రం యువకులు గణేశ్ విగ్రహాన్ని ట్రాక్టర్‌పై మండపానికి తరలిస్తున్నారు. మార్గమధ్యంలో అడ్డం గా ఉన్న విద్యుత్ తీగలను ఓ కర్ర సహాయంతో పైకి లేపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ కు గురై టోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మృతి చెందారు.
అఖిల్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ షాక్ తీవ్రతకు ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తీవ్రంగా గాయపడిన అఖిల్‌ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని, దగ్ధమైన ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగించారు.
అంబర్‌పేటలో రామ్‌చరణ్ అనే యువకుడు విగ్రహ తరలింపులో భాగంగా అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఉట్టి కొడుతుండగా విద్యుత్ షాక్‌తో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కేవలం రెండు రోజుల్లోనే ఎనిమిది మంది మృతిచెందడం విషాదాన్ని నింపింది.
కిందపడి చనిపోయారు:ఎస్‌ఈ శ్రీరామ్‌మోహన్
బండ్లగూడలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఈ శ్రీరామ్‌మోహన్ మాట్లాడుతూ.. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో యువకులు చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. “ట్రాలీపై ఉన్న వ్యక్తులు అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మా నిర్లక్ష్యం లేదు:సీఎండీ ముషారఫ్ ఫరూఖి
ప్రమాదాల నేపథ్యంలో ఉప్పల్, రామంతాపూర్, చిలకానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రమాదకర కేబుళ్లను తొలగిస్తున్నారు. మరోవైపు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ ఫరూఖి మంగళవారం బండ్లగూడలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, ప్రమాద తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎండీ ముషారఫ్ ఫరూఖి మాట్లాడుతూ.. రామంతాపూర్, బండ్లగూడ, అంబర్‌పేట సంఘటనల్లో విద్యుత్ శాఖ పరంగా ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారు. ఇతర కారణాల వల్లనే ఈ ప్రాణ నష్టం జరిగిందని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో..
కామారెడ్డి(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాల్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ (19), సిరిసిల్ల సుభాష్ నగర్‌కు చెందిన సాయి (24) గణపతి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద సోమవారం గణపతి విగ్రహాన్ని కొన్నారు. వాహనంపై తీసుకెళ్తుండగా.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి కస్తూర్బా స్కూల్ వద్ద విద్యుత్ వైర్లు తగిలడంతో షాక్‌కు గురై ఇద్దరు కిందపడిపోయారు. లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా, సాయి తీవ్రంగా గాయపడ్డాడు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.