09-01-2026 01:02:53 AM
రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల దుర్మరణం
మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా విపత్తు
అతివేగమే కారణమని భావిస్తున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
శంకర్‌పలి,జనవరి 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిలా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మోకిల పోలీసులు తెలిపిన వివరాల మేరకు శంకర్‌పల్లి మండల పరిధిలోని దొంతాన్‌పల్లి ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు, ఎంజీఐటీ కళాశాలకు చెందిన ఒకరు స్పోర్ట్స్ కారులో కోకాపేట్‌లో పుట్టిన రోజు పార్టీ వేడుకలకు వచ్చారు. అనంతరం వారిని ఎంజీఐ విద్యా ర్థి రోహిత్ డ్రాప్ చేయడానికి వచ్చాడు. కారు అదుపుతప్పి మిర్జాగూడ గేటు వద్ద అర్ధరాత్రి చెట్టును ఢీకొట్టడంతో కారు లో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరొక విద్యార్థిని గాయపడగా ఆమెను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతు లు సూర్య తేజ (20), సుమిత్ (20), నిఖిల్ (18), రోహిత్ (20)గా గుర్తించారు, నక్షత్ర తీవ్రం గా గాయపడడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రోహిత్ వారిని డ్రాప్ చేయడానికి వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుందని గుర్తించారు. అతివేగం కారణంగానే కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.