calender_icon.png 1 August, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరోగసీలతో మోసం

01-08-2025 01:02:35 AM

  1. అనస్థీషియా డాక్టర్ సదానందం సహకారం 
  2. పోలీసుల విచారణలో నిజాలు ఒప్పుకున్న ‘సృష్టి’ నమ్రత
  3. ఐదురోజుల పోలీసు కస్టడీ

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 31 (విజయక్రాంతి):  ఐవీఎఫ్ కోసం వస్తున్న వారిని సరోగసీ వైపు మళ్ళించి డబ్బులు దోచుకున్నామని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డా. నమ్రత ఒప్పుకున్నారని పోలీసుల విచారణ లో తేలింది. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం పూర్తిస్థాయిలో సహకరించాడని, పేషెంట్లకు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మత్తుమందు ఇచ్చేవాడని తేలింది. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమ సరోగసీ, శిశువుల విక్రయాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది.

తెలిసే తప్పులు చేశాం

పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అనేక నిజాలను ఒప్పుకున్నట్లు సమాచారం. ‘ తెలిసే తప్పులు చేశాం.. సరోగసీ చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశాం. రాజస్థాన్ దంపతులు డీఎన్‌ఏ పరీక్షలు అడుగుతారని ఊహించలేదు. నిజం బయటపడుతుందని భయపడి వారి ని తప్పించుకున్నాం. చివరికి వారే పరీక్షలు చేయించుకోవడంతో మా మోసం వెలుగులోకి వచ్చింది’ అని నమ్రత పోలీసుల ముందు అంగీకరించారు.

సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసీ చేయకపోయినా చేసిన ట్లు నమ్మించామని.. డీఎన్‌ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. రాజస్థాన్ దంపతులే డీఎన్‌ఏ చేయించుకోవడంతో అసలు నిజయం బయటపడిందన్నారు. డీఎన్‌ఏతో తమ మోసం వెలుగులోకి వచ్చిందన్నారు.

కొన్ని రోజులు సమ యం ఇస్తే తప్పును సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పామని పేర్కొన్నారు. రాజస్థాన్ దంపతులనుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్ల కాంటాక్ట్‌ని పూర్తిగా బ్లాక్ చేశామని వివరించారు. రాజస్థాన్ దంపతుల నుంచి ఒత్తిడి రావడంతో అడ్వకేట్ అయిన తన కుమారుడిని రంగంలో దించినట్లు.. తన కుమారుడి ద్వారా దంపతులను బెదిరించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

అనస్థీషియా డాక్టర్ సదానందం పూర్తి సహకారం

‘సరోగసి పేరుతో సృష్టి ఇప్పటివరకు చాలా మోసాలు చేసింది. ఐవీఎఫ్ కోసం వస్తున్న వారిని సరోగసి వైపు మళ్ళించి డబ్బులు దోచుకున్నారు. రాజస్థాన్ దంపతులు డీఎన్‌ఏ పరీక్షలు అడుగుతారని డాక్టర్ నమ్రత ఊహించలేదు. గాంధీ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం పూర్తిస్థాయిలో సహకరించాడు. డాక్టర్ సదానందం ఎప్పు డు పడితే అప్పుడు వచ్చి మత్తుమందు ఇచ్చేవాడు. సదానందం సహకారంతో డాక్టర్ నమ్రత సృష్టిని నడిపిస్తు న్నది.

ఆంధ్రాలో కొంతమంది ఏఎన్‌ఎమ్ టీచర్ల సహాయం సృష్టి తీసుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల తీసుకొని రావడంలో ఏఎన్‌ఎం కార్యకర్తలే సూత్రధారుగా ఉన్నారు. గర్భం దాల్చగానే వారిని కంట్రోల్‌లో పెట్టుకొని డెలివరీ తర్వాత పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని తీసుకువస్తే వాళ్లకు అన్ని బహుమానాలు ఇచ్చింది నమ్రత. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం’ అని పోలీసులు స్పష్టం చేశారు.

కేసులో కల్యాణి పాత్ర కీలకం

సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కల్యాణి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 2012లో ఏఎన్‌ఎం నర్సుగా చేరిన కల్యాణిని 2020లో వైజా గ్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా నమ్రత నియమించారు. ఆర్థిక లావాదేవీలన్నీ కల్యాణినే చూసుకునేవారని, అక్రమ లాభాల్లో ఆమెకు వాటా ఇచ్చేవారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. నమ్రత చెప్పినట్లుగా స్కానింగ్ రిపోర్టులను ఎడిట్ చేసి, పిల్లలు లేని దంపతులకు పంపేది కల్యాణి.

ఈ కేసులో రాజస్థాన్ దంపతులను మొదట కలిసింది కూడా ఆమెనే. జూన్ 5న అసోం మహిళకు పుట్టిన బిడ్డను కల్యాణినే రాజస్థాన్ దంపతులకు అప్పగించింది. పోలీసుల కస్టడీలో నమ్ర త, జయంత్ కృష్ణలను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని కీలక విషయాలు బయ టపడే అవకాశం ఉంది. ఈ కేసులో పోలీసులు 39 మంది సాక్షులను చేర్చారు. సృ ష్టి టెస్ట్‌ట్యూబ్ సెంటర్‌లో తనిఖీలు చేసి రూ. 2.37 లక్షల నగదుతో పాటు వందలాది కేసు షీట్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అనాథగా రెండు నెలల బాబు

సరోగసీ మోసాల కేసులో సృష్టి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత జరిపిన చీకటి దందా కారణంగా ఓ రెండు నెలల పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కన్నవారు, పెంచుకున్న వారు ఇద్దరికీ దూరమై ఆ చిన్నారి శిశువిహార్‌కు చేరింది. ఈ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. పిల్లలు లేని రాజస్థాన్ దంపతులకు సరోగసీ ద్వారా బిడ్డను అందిస్తానని డాక్టర్ నమ్రత హామీ ఇచ్చింది.

అందుకోసం వారి నుంచి రూ. 35 లక్షలు వసూలు చేసింది. అయితే, వాస్తవానికి ఆమె అస్సాంకు చెందిన మహ్మద్ ఆలీ ఆదిక్, నస్రీమా బేగం దంపతుల నుంచి వారి మగబిడ్డను కేవలం రూ.90 వేలకు కొనుగోలు చేసింది. ఈ బిడ్డను సరోగసీ ద్వారా పుట్టిందని న మ్మించి రాజస్థాన్ దంపతులకు అప్పగించింది. ఈ కేసులో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణలతో పాటు, తమ బిడ్డను అమ్ముకున్న అస్సాం దంపతులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

దీంతో అటు పెంచుకోవాలనుకున్న రాజస్థాన్ దంపతులకు, ఇటు కన్నవారికి దూరమైన ఆ రెండు నెలల పసికందు ఇప్పుడు శిశువిహార్‌లో అనాథగా జీవిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆ పసికందు భవిష్యత్తుపైనే ఉంది. కన్నతల్లిదండ్రులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను వారికి అప్పగిస్తారా? ఒకవేళ వారు బిడ్డను పెంచడానికి నిరాకరిస్తే, శిశువిహార్‌లోనే ఉంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

పుట్టిన వెంటనే బిడ్డను అమ్ముకున్న దంపతులకు బిడ్డను అప్పగించడం నిబంధ నలకు విరుద్ధం కాదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపైనే ఆ పసికందు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో డాక్టర్ నమ్రతతో పాటు, బిడ్డ తల్లిదండ్రులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.