01-08-2025 08:43:03 PM
ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) తెలిపారు. డీఎంఎఫ్టీ నిధులతో ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలోను తంగళ్ళపల్లి స్వామి వివేకానంద కాలనీ, పాతవాడలలో నూతనంగా నిర్మించిన 3 అంగన్వాడీ కేంద్రాల భవనాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కే కే మహేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 585 అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 20 కోట్లతో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 170 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 49, ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం 9 కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
అన్ని భవనాలు రానున్న ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు.ఇందులో భాగంగా మొదటి అంగన్వాడీ కేంద్రాన్నీ కిషన్ దాస్ పేటలో ప్రారంభించామని వివరించారు. భవనం త్వరగా పూర్తి చేసేలా విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆడుతూ... పాడుతూ విద్యను అభ్యసించే అవకాశం వస్తుందని వివరించారు. అనంతరం అంగన్వాడి పిల్లల చేత గేయాలను పాడించి వారితో ముచ్చటించారు, తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఈ.ఈ పి.ఆర్ సుదర్శన్ రెడ్డి,తాసిల్దార్లు ఎంపీడీవోలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.