22 August, 2026 | 4:01 AM

ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్

22-08-2026 12:00 AM

ఈ నెల 23న కోచింగ్ అర్హత పరీక్ష 

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో ఎస్త్స్ర, కానిస్టేబుల్ తదితర పోస్టులకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రాథమిక రాత పరీక్షకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపారు. ఉచిత కోచింగ్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు సమీప పోలీస్ స్టేషన్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలలో, శ్రీ చైతన్య పాఠశాలలో, ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అభ్యర్థులు అదిలాబాద్ పట్టణంలోని చావర అకాడమీలో ఈ నెల 23న నిర్వహించే అర్హత పరీక్ష రాసేందుకు హాజరుకావాలని కోరారు. ఆదివారం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష పేపర్ సంబంధిత అభ్యర్థి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి 11 గంటలకు పరీక్ష ఉంటుందని తెలిపారు. 

డీటీసీలో శిక్షణ...

ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి, ఆదిలాబాద్ డిటిసి (డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్) లో నిష్ణాతులైన ప్రైవేటు అధ్యాపకులచే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు కావలసిన అన్ని అంశాలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శిక్షణతో పాటు అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, నిపుణులచే మార్గదర్శకత్వం, రాత పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రమశిక్షణతో చదువుతూ, పట్టుదలతో శిక్షణను కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కోచింగ్ నందు శిక్షణ తీసుకొని ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత పొంది, మెయిన్స్ కి అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయంతో కూడిన శిక్షణ సైతం అందించబడుతుందని తెలిపారు.