10-12-2025 08:20:39 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణ పర్యవేక్షించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో సరిపడా కుర్చీలు, టేబుల్లు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరోసారి బ్యాలెట్ పేపర్లను సరి చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద వరుస క్రమంలో వచ్చేలా క్యూ లైన్లు పాటించాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రజలు గుంపులుగా ఉండకూడదని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి సమయానికి టీ, అల్పాహారం, భోజనం అందించే విధంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అంతకుముందు కెరమెరి మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది తరలింపు పై మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జోనల్ అధికారులు, స్టేజ్ - 2 ఆర్. ఓ. లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.