11-12-2025 05:12:43 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి, వాంకిడి మండలం బెండర గ్రామపంచాయతీలోని నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్.పి. నితిక పంత్, ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగిందని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిందని తెలిపారు.
ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచిస్తూ పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో పోటీ చేయు సర్పంచ్, వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీలో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నారని, జిల్లాలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని తెలిపారు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత నమూనాలో నమోదు చేయాలని స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు వరుసలో ఉన్న వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని, సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి ఎవరిని అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.