11-12-2025 05:15:27 PM
60 లక్షలకు పైగా ఆస్తి నష్టం.. షార్ట్ సర్క్యూట్ కారణమనే అనుమానం..
అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని భవానిపురం కాలనీలో ఉన్న తుల్జా భవాని షాపింగ్ మాల్‌లో బుధవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆకస్మికంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మాల్‌లోని వస్త్రాల గోదాములు, షెల్ఫ్‌లు, ఫర్నిచర్, నిల్వ ఉంచిన స్టాక్ పూర్తిగా మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
సుమారు రెండు ఫైరింజన్లు రాత్రంతా శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు రూ.60 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు మాల్ యజమాని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయానికి మాల్ మూసివేసి ఉండడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.