16-07-2025 01:21:16 AM
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. త్వరలో పరిశ్రమలకు గ్రీన్ పవర్ సరఫరా చేసే ఆలోచనలో రాష్ర్ట ప్రభుత్వం ఉందని తెలిపారు.
మూసి పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊహకు అందదని అన్నారు. ట్రిపుల్ ఆర్‌కు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య ఐటీ, ఫార్మా, హౌసింగ్ వంటి అనేక క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని, వాటిని అభ్యుదయ పారిశ్రామికవేత్తలకు కేటాయించి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిపారు.
మంగళవారం ఆయన హైదరాబాదులో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘పారిశ్రా మికవేత్తల కోసం మా ద్వారాలు తెరిచే ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు చిన్న సమస్య వచ్చినా స్పందించేం దుకు సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రివర్గం సిద్ధంగా ఉంటుంది.
పారిశ్రామిక వేత్తలు కోరినట్టు పెండింగ్ పవర్ బిల్లులను సింగిల్ టైం సెటిల్మెంట్ చేసేందుకు ఆలోచనతో ఉన్నాం. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలమైనది. ఎంతమంది పెట్టుబడిదారులనైనా అక్కున చేర్చుకుని అవకాశాలు కల్పిస్తాం.’
అని వివరించారు.సంక్షేమం, అభివృద్ధిని జోడేడ్లుగా భావించి ముందుకు వెళుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి రాష్ర్టంలో పెద్దఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.
మార్గదర్శిగా ఎఫ్‌టీసీసీఐ
100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి పరిశ్రమలకు ఒక మార్గదర్శిగా ఎఫ్‌టీసీసీఐ నిలిచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగే వరకు ఎఫ్‌టీసీసీఐ ప్రతి దశలోనూ ముందు నడిచిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరాల సరసన నిలబెట్టే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ కారిడార్లు, స్థిరమైన అభివృద్ధి, నగర నవీకరణ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులతో రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
కార్యక్రమం లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అధ్యక్షుడు సురేశ్ కుమా ర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.