16-07-2025 01:20:58 AM
- ట్యాపింగ్ ఫోన్ నంబర్లపై సిట్ ప్రశ్నలు
- సాక్షుల వాంగ్మూలాలతో ప్రశ్నల వర్షం
హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 15 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును సిట్ మరింత ముమ్మరం చేసిం ది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరోమారు విచారించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ముందుంచి, కీలకమైన సాంకేతిక ఆధారాలతో ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశా రు. ముఖ్యంగా 2023 నవంబర్‌లో కేవలం 15 రోజుల వ్యవధిలో ట్యాప్ చేసిన 618 ఫోన్ నంబర్ల గుట్టు విప్పేందుకు అధికారులు ప్రయత్నించారు.
పొంతనలేని సమాధానాలు
2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్య సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన డేటాను విశ్లేషించిన సిట్, 618 ఫోన్ నంబర్లను గుర్తించింది. ఈ నంబర్లు ఎవరివి? ఎవ రి ఆదేశాలతో వీటిని నిఘా నీడలోకి తెచ్చారు అనే అనే కోణంలో ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో నవంబర్ నెలలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈ విచారణ అంతా ఇప్పటికే సేకరించిన సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా జరగడంతో ప్రభాకర్ రావు పొంతనలేని సమాధానాలు ఇచ్చిన్నట్లు సమాచారం.
కస్టడీ కోసం సుప్రీంకోర్టుకు సిట్
ప్రస్తుతం ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు నుంచి ఆగస్టు 5 వరకు అరెస్టు నుంచి రక్షణ ఉంది. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక విషయాలను దాచిపెడుతున్నారని భావిస్తున్న సిట్ అధికారులు, కస్టోడియల్ విచారణే శరణ్యమని నిర్ణయించారు. ఇందులో భాగంగా, అరెస్టు చేయరా దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిటి షన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. కస్టడీకి అనుమతి లభిస్తే, ఈ కేసు దర్యాప్తులో మరింత వేగం పుంజుకుని, ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు బయటపడతారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.
ల్యాప్‌టాప్, ఫోన్‌లో కీలక డేటా
ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు సీజ్ చేసిన ప్రభాకర్‌రావు వ్యక్తిగత ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు జరిగిన కాల్స్, సంభాషణల డేటాను వెలికి తీసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథ మికంగా లభించిన ఆధారాల ప్రకారం.. పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో పాటు, కొందరు పోలీసు ఉన్నతాధికారులతో ప్రభాకర్‌రావు నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు సిట్ గుర్తించింది. ఈ డేటా పూర్తిగా బయటకు వస్తే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.