calender_icon.png 6 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి సేద్యంతోనే భవిష్యత్తు మనుగడ

06-09-2025 12:00:00 AM

రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి 

మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రసాయన ఎరువులు పురుగుమందుల వినియోగం వల్ల భూమి సహజత్వం పూర్తిగా కోల్పోయి, భవిష్యత్ తరాలకు మేలైన ఆహారం అందించే పరిస్థితి లేకుండా పోయిందని, అన్నదాతలు కేంద్రీయ విధానం, ప్రకృతి సేద్యం చేస్తే తప్ప వ్యవసాయరంగం మనుగడ సాగించే పరిస్థితి లేదని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి అన్నారు.

మహబూబాబాద్ జిల్లా తాళ్లపూస పల్లిలో సొల్లేటి జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంపై  ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ విపరీతమైన రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల పలు ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలు విషతుల్యంగా మారి ప్రజలు తింటే అనారోగ్యం, క్యాన్సర్ బారిన పరిస్థితికి వచ్చిందన్నారు.

2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారన్నారు. రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అమలుచేసి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. అదే తరహాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

రైతులకు రుణమాఫీ, 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి, భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. రైతులు కూడా భవిష్యత్తు ఆలోచించి రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు పయనించాలన్నారు. ఎరువుల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు సునీల్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, హార్టికల్చర్ అధికారి మరియన్న పాల్గొన్నారు. అంతకుముందు రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తదితరులు కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు.