06-09-2025 12:00:00 AM
రంగారెడ్డి, సెప్టెంబర్5(విజయక్రాంతి): రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వ స్థలాలు,పార్కులు అన్యకాంతం కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని వ్యాఖ్యానించింది. కానీ బడంగ్పేట్ కార్పొరేషన్ లో ప్రజలు తమ బాధ్యతను గుర్తు ఎరిగి కార్పొరేషన్ లో అన్యకాంతమైన పార్కు స్థలాలను కాపాడేందుకు నడుంబిగించారు కానీ... అధికారులు మాత్రం బాధ్యతరాహితంగా వ్యవహరిస్తున్నారు.
కళ్ళముందే కార్పొరేషన్‌లో వం దల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను అక్రమార్కులు గద్దలా తన్నుకు పోతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇక్కడ అక్రమార్కులకే అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ కార్పొరేషన్ లో అధికారులపై బహిరంగంగా నే స్థానికులు పలు ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.
రాత్రికి రాత్రే కబ్జాలు..
కార్పొరేషన్‌లో ప్రభుత్వ భూమి అని తెలిస్తే చాలు రాత్రికి రాత్రే భూమిని చేరబట్టి.. ప్రభుత్వ భూమి ఆనవాలు లేకుండా చెరిపి వేయడంలో కార్పొరేషన్ లో కొందరు ఆరితేరారు. వీరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో అధికారులు సైతం వారికి వత్తాసు పలుకుతూ జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నారు. కార్పొరేషన్ లో ఈ వ్యవహారం అంతా గత కొన్ని ఏళ్లుగా చాప కింద నీరులా కొనసాగుతుండడం పరిపాటిగా మారింది.
ఇప్పటిదాకా దాదాపుగా 7వేల గజాల కు పైగా పార్క్ స్థలాలు కబ్జారాయిలు చేరబట్టారంటేనే అక్రమాలు ఎలా సాగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అక్రమార్కులపై స్థానికులు ఫిర్యాదు చేస్తే ఆ కాలనీ లో కొందరిని తమకు అనుకూలం గా మార్చుకొని వారికి ప్రలోభాల ఎరా చూపెట్టి.... ఉల్టా ఫిర్యాదుదారులపైనే వారిని ఉసిగొలుపుతున్నారు. అని గతంలో ఇలాంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.
కార్పొరేషన్ లో ఓ కాలనీవాసులు పార్క్ స్థలాలపై పోరాటం చేస్తే మీర్పేట్ పీఎస్ లో గతంలో పనిచేసిన ఒక సీఐ స్థాయి అధికారి వారిని బెదిరింపులకు గురి చేస్తూ ఉల్టా వారిపైనే కేసులు నమోదు చేయడం గమనార్హం. ఇదంతా మనకెందుకులే అని కొందరు ఫిర్యాదుదారులు వెనుకకు తగ్గుతున్న మరికొందరు సామాజిక బాధ్యతగా గుర్తెరిగిన పౌరులు ఓటమెరుగని విక్రమార్కుల్లా ఫిర్యాదులు చే స్తూనే ఉన్న....
అధికారులు మాత్రం చాలా లైట్ గా తీసుకొని అట్టి ఫిర్యాదులను సైతం బుట్ట దాఖలు చేస్తున్నారు. పై అధికారుల దృష్టికి ఒకవేళ వస్తే తప్పని పరిస్థితిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నామమాత్రంగా కబ్జా రాయులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి. ఇక్కడ అంతా సిండి కేట్ రాజకీయ వ్యవస్థ కనుసైగలోనే ఆక్రమాలు కొనసాగుతుంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కమిషనర్ వింత సమాధానం..
బడంగ్పేట్ కార్పొరేషన్ లో పార్క్ స్థలాలపై కబ్జా గురించి కమిషనర్ సరస్వతి ని వివరణ కోరగా.. వింత సమాధానం చెబుతున్నారు. ఆక్రమణలు జరిగాయా? అయి తే మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలంటున్నారు. పార్క్ స్థలాల ఆక్రమణలపై ఇది వరకే స్థానికులు మీకు ఫిర్యాదులు చేశారు కదా. తిరిగి ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటామంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఆక్రమణలు..
బడంగ్పేట్ కార్పొరేషన్ లో ప్రధానంగా 31 వ డివిజన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ చరవేగంగా విస్తరించ డంతో పలు కాలనీలు వెలిశాయి. దీంతో అక్కడ రియల్ వ్యాపారం జోరందుకుంది. అదే స్థాయిలో అక్కడ మెజార్టీ పార్కు స్థలాలు కనుమరుగయ్యాయి.
నాదర్గుల్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 743, 747, 748 749 నుంచి 750 వరకు 500 గజాల స్థలం, బడంగ్పేట్ లో సర్వే నెంబర్ 79,80 మారుతీ నగర్ లో 2188 గజాలు, ఎం సి ఆర్ కాలనీ లో సర్వేనెంబర్ 179 నుంచి 143 వరకు 1,911 గజాలు, గాయత్రి హిల్స్ నాదర్గుల్లో సర్వేనెంబర్ 756, 776 లో 679 గజాల పార్కు స్థలం అన్యాక్రాంతమైనట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు లు చేశారు.
ఇలా మచ్చుకు కొన్ని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్‌లో కనుమరుగైన పార్కు స్థలాలు, ప్రభుత్వ భూముల పై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఫోకస్ పెడితే కార్పొరేషన్ లో మరిన్ని ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల ఆక్రమణలకు సంబంధించిన భూములు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.