23-04-2025 01:20:13 AM
ఎన్ని విమర్శలు వచ్చినా గద్దర్ పేరుతోనే అవార్డులు l మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టీకరణ
జూన్ 14న హెచ్‌ఐసీసీ వేదికగా పురస్కారాల ప్రదానం l ప్రకటించిన ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
సినీ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అం దించతలపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక ఖరారయ్యింది. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇందుకు సంబంధించి ఏర్పాట్లకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
ఈ నేప థ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, జయసుధ హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడు తూ.. ‘దశాబ్ద కాలంగా పరిశ్రమకు చెందిన వారి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు, అవార్డులు ఇవ్వలేదు. ఇలా నిర్లక్ష్యం చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయి.
గద్దర్ తన గళంతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. గద్దర్ పుట్టుక తెలంగాణ రాష్ట్ర అదృష్టం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ గద్దర్ బాణీ, పాటలను అనుకరిస్తారు. గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయం.. సముచిత నిర్ణయంగా భావిస్తున్నాం. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తాం. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలనూ ప్రోత్సహిస్తాం.
హైదరాబాద్ లో జరిగే చలనచిత్ర అవార్డుల వేడుక ఘనంగా నిర్వహించాలి. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తాం’ అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.
హెచ్‌ఐసీసీ వేదికగా అవార్డుల ప్రదానం..
ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. జూన్ 14న గద్దర్ తెలంగా ణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నామని ప్రకటించారు. హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
15 మంది సభ్యులతో ఏర్పాటైన జ్యూరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు అందినట్టు ఇటీవల వెల్లడించారు.
అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు. అయితే అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను తాజాగా నిర్వహించిన మీడి యా సమావేశంలో జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధకు భట్టి విక్రమార్క, దిల్ రాజు అందించారు. ఎంపికైన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు.
లోగో ఆవిష్కరణ వాయిదా..
పోప్ ఫ్రాన్సిస్ మరణం కారణంగా మంగళవారం విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ ఉంటుందని వారు తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు.