calender_icon.png 6 July, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాల జరీ సోయగం

06-07-2025 12:03:30 AM

  1. నడిగడ్డ చేనేత వస్త్రాలకు అడ్డా

మగువల మనసును దోచేలా చీరలు 

18వ శతాబ్దంలోనే చేనేత సంపదకు పురుడు

తిరుపతి వెంకన్నకు జోడు పంచెలు

జరీ చీరలను నేయడంలో గద్వాల స్పెషల్

ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేలకు పైగా కార్మికులు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ అనగానే గద్వాల సంస్థానాథీశుల ఘన చరిత్ర,  సాగు, తాగు, విద్యుత్ ప్రాజెక్టుల చరిత్ర. నడిగడ్డ అనగానే విత్తన పత్తి చరిత్ర. వీటి వరసలోనే నడిగడ్డ ఎదలో కొలువై ‘గద్వాల జరీ చీరల‘ చేనేత పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతిని సొంతం చేసుకుంది. 

ఉమ్మడి పాలమూర్ జిల్లాలో నడిగడ్డ అంటేనే వెనుకబడిన ప్రాంతంగా పిలువబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు నేసిన జరీ చీరలు, పట్టు పంచెలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియని వారు ఉండరు. అంత ప్రత్యేకతను ఈ ప్రాంతం నుంచి నేసిన చీరలు సొంతం చేసుకున్నాయి. యంత్రాల సహకారం లేకుండా మగ్గంపై చేతులతో చీరలను నేయడం గద్వాల ప్రత్యేకత. 

సాధారణంగా చేనేత చీరలను ఇద్దరు వ్యక్తులు కలిసి నేస్తే 2 నుంచి 4 వారాలు, క్లిష్టమైన డిజైన్ ఉన్న చేనేత చీరలను నేయడానికి నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని కార్మికులు తెలిపారు. గద్వాల చేనేత కార్మికులు నేసిన చీరలు దేశ, విదేశ మహిళల ఆదరణను పొందుతున్నాయి. రాష్టంలోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు శుభకార్యాలకు చీరలను కొనుగోలు చేసేందుకు మహిళలు గద్వాలకు వస్తున్నారు. 

జరీ చీరలను నేయడంలో గద్వాల స్పెషల్ 

జరీ చీరలను నేయడం  గద్వాల చేనేత కార్మికుల స్పెషల్. ఈ చీరలో వెండి, బంగారంతో తయారు అయిన జరీ పోగులను బార్డర్, కొంగు, చీర మధ్యలో డిజైన్, బుట్టాలకు తమ ప్రతిభను జోడించి చీరలో అందాలను అద్దడంలో గద్వాల చేనేత కార్మికులు దిట్ట. గద్వాల చీరలు రూ. 10 వేల నుంచి లక్ష వరకు అందుబాటులో ఉంటాయి. అంతకు మించి డిజైన్ మరింత ఖర్చుతో కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాల్సి ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.

 సంస్థానాధీశుల కాలంలోనే చేనేత చీరలకు పురుడు

గద్వాల చీరలు నేయడం ఆనాటి సంస్థానాధీశుల కాలంలోనే పురుడు పోసుకుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. రాజా సీతారామ భూపాల్ బహదూర్ (1807 ) గద్వాల సంస్థానాన్ని పరిపాలిస్తున్న రోజులవి. అప్పటివరకు గద్వాల సంస్థానంలో ‘రాజమహల్‘ ‘కంగోరా‘ పేర్లతో చీరలను నేసేవారు. జాతీయంగా వచ్చిన మార్పులతో వీటికి గిరాకీ తగ్గి నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో అప్పటి రాజు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా గద్వాల నేత పరిశ్రమను తీర్చిదిద్దాలని అనుకున్నారు.

తమ సంస్థానంలో నిష్ణాతులైన కొందరు కార్మికులను ఎంపిక చేసి నూతన డిజైన్ల తయారీలో శిక్షణను పొందడానికి ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి పంపించారు. అదే సందర్భంలో ధర్మవరం, కంచి వంటి ప్రాంతాల నుంచి పలు డిజైన్లను తెప్పించి జాతీయ మార్కెట్ కు ధీటుగా గద్వాలలో నేత పని సాగేలా శిక్షణ ఇప్పించారు. కార్మికులు పొందిన శిక్షణతో ఇక్కడి నేత పరిశ్రమ దశ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

నూలులో సిసలైన బంగారం, వెండి జరీని పొదిగి నూతన డిజైన్లతో చక్కని అంచులు కలిగిన చీరల తయారీ సాగింది. అనతి కాలంలోనే ఈ నేత పని ఎంతో ప్రాచుర్యం పొంది ‘గద్వాల జరీ చీరల‘ పేరుతో ప్రపంచ మార్కెట్ కు చేరింది.

ఇంపీరియల్ గజెటీయరు ఆఫ్ ఇండియా‘లో గద్వాల జరీ చీరలు

‘ఇంపీరియల్ గజెటీయరు ఆఫ్ ఇండియా‘లో గద్వాల జరీ చీరల ప్రాశస్త్యాన్ని పేర్కొనడం జరిగింది. 1908లో ఇక్కడి నుంచి జరీ చీరలు, రవ సెల్లాలు, ధోవతులు (బంగారు అంచులతో తయారైనవి) హైదరాబాదుతో సహ భారతదేశంలోని అనేక ప్రాంతాలకు పంపబడినట్లు గజెటీయర్ లో పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఆనాడే దాదాపు రెండు లక్షల ఎగుమతులను సాధించి భారత వస్త్ర పరిశ్రమ దృష్టిని గద్వాల వైపు ఆకర్షించింది. 

తిరుపతి వెంకన్నకు జోడు పంచెలు

కలియుగ ప్రత్యక్ష్య దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి అలంకరించే ఏరువాక జోడు పట్టు పంచెలు గద్వాల నుంచి వెళతాయి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణం సందర్భంగా మూలమూర్తికి ఈ పంచెలను అలంకరించడం విశేషం. దాదాపుగా 400 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఆనాటి సంస్థానాధీశుడు కృష్ణారావు భూపాల్ తో మొదలైన సంప్రదాయాన్ని నేటికీ వారి వారసులు కొనసాగిస్తున్నారు. 41 రోజులు నిష్టతో నేసిన ఈ పంచెలు శ్రీవారికి ఇష్టమైనవిగా, ఈ పంచెలను స్వామివారి నుంచి తీసిన తర్వాత కూడా సుగంధ పరిమళం అలాగే వస్తుంది.  

పలు దేవస్థానాలకు చేనేత వస్త్రాలు

అమెరికాలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో జోడు పంచెలను పంపిస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి గద్వాల చేనేత కార్మికులు నేసిన చీరను హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలకు సమర్పిస్తున్నారు.

10 వేలకు పైగా ఉపాధి

గద్వాల జిల్లా వ్యాప్తంగా 3 వేలకు పైగా మగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేలకు పైగా కార్మికులు ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. గద్వాల జిల్లా కేంద్రంతో పాటు అలంపూరు, అయిజ పట్టణాలతో పాటు రాజోలి, ప్రాగటూరు, సిందనూరు, ఎక్లాస్‌పురం, గట్టు, మాచర్ల, మారమునగాల, గోర్లఖాన్ దొడ్డి, ఆరగిద్ద, నాగర్ దొడ్డి, కాకులారం, కుర్వపల్లి తదితర గ్రామాల్లో కార్మికులు చేనేత చీరలను, పంచెలను నేస్తున్నారు. 

మహిళల మనసును దోచేలా 

నాటి నుంచి నేటితరం ఆధునిక మహిళల మనసును కట్టుపడేలా డిజైన్లతో కూడిన చేనేత చీరలు నేయడంలో గద్వాల చేనేత కార్మికులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. జరీ చీరలను మొదలుకొని  నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా కాటన్ సిల్క్ (సీకో) దారాలతో చీరలను నేస్తున్నారు. ఒకవైపు తమ చీరల గుర్తింపు పోకుండా మరింత ఆదరణ పొందేందుకు ఎవరికి వారు పోటీ పడుతూ చీరలను నేస్తున్నారు.   

చిన్నప్పటి నుంచి నేస్తున్న

మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి చేనేత చీరలను నేస్తున్నాను. ఒక చీరను నేయడానికి వారం రోజులు పడుతుంది. నెలలో 4 చీరలను నేస్తున్నాము. రోజుకు 12 గంటలు కష్ట పడితేనే వారంలో ఒక చీరను నేయడం జరుగుతుంది. 

 చిన్ని నాగరాజు, చేనేత కార్మికుడు, గద్వాల 

ప్రభుత్వం అండగా నిలవాలి

చేనేత వృత్తిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలి.  చేనేత, అనుబంధ రంగాల పైన జీఎస్టీ 12 శాతం వేయడం వలన మోయలేని భారం పడుతుంది. చేనేత శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.

 అక్కల శాంతరామ్, గద్వాల తాలుకా చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి