calender_icon.png 6 July, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్రకదబ్ర.. AI మాయ!

06-07-2025 12:00:00 AM

ప్రతిచోట ఏఐ మ్యాజిక్ చేస్తున్నది. చిన్న క్లిక్‌తో.. బుజ్జిబాబు చిటికెలో చిన్నికృష్ణుడిలా, చిట్టిపాప అందాల రాకుమారిలా ఏఐ సహాయంతో క్షణంలో మార్చొచ్చు.  సూపర్‌మ్యాన్‌లా, స్పైడర్‌మ్యాన్‌లా, సిండ్రిల్లాల.. ఇంతేనా.. ఊహించిన ప్రతి పాత్రలోకి ఇట్టే దూరిపోవచ్చు.. ఏఐ ఫొటో మాత్రమే కాదు.. ప్రస్తుతం జీబ్లీ స్టుల్ ట్రెండ్ నడుస్తున్నది. నిమిషాల్లో అనుకున్న చిత్రంలో ప్రత్యక్షం అవ్వొచ్చు..

ఏఐతో రకరకాల దేవుళ్లే కాదు.. వ్యోమగామీ, స్పైడర్‌మ్యాన్, రకరకాల కార్టూన్ పాత్రలూ.. ఇలా ఏదైనా సరే, ఎంచుకున్న ఫోటోల్లో పిల్లల ముఖాల్ని పెట్టుకుని అచ్చం మన పిల్లలే అలా రెడీ అయ్యారా అన్నట్లు ఫోటోలు తయారుచేసుకోవచ్చు.

అంతేకాదు, ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే చిత్రాల్లానూ మార్చుకోవచ్చు. బుజ్జి బాబును పులి మీద స్వారీ చేయించొచ్చు. చిట్టి పాపను రాజుల కాలంలోకి తీసుకెళ్లొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే సృజనకు పనిచెబుతూ నచ్చిన చిత్రంలో మన చిన్నారి రూపాన్ని తీసుకురావొచ్చన్నమాట. 

ఏఐ ఫొటో..

ఏఐ ఫొటో టూల్స్ ఉపయోగిస్తూ ఈమధ్య చాలామంది తమ ముఖాల్ని ఈ ఏఐ ఫొటోలుగా మార్చుకుంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి రీమేకర్ ఏఐ టూల్. దీంట్లో ఒక్కరి ఫొటో లేదా మల్టిపుల్ ఫేసెస్ ఫొటోల్నీ రీమేకింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, వీడియోలోని మనుషుల ముఖాల్లోనూ మనకిష్టమైన ముఖాల్ని సెట్ చేయొచ్చు. చేయాల్సిందల్లా.. ముందుగా మనం కోరుకున్న గెటప్ చిత్రాన్ని ఒరిజినల్ ఫోటో దగ్గర అప్‌లోడ్ చేసి,

ఆ తర్వాత టార్గెట్ ఫేస్ దగ్గర పాపాయి ఫొటోని అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు కిందనున్న స్వాప్ ఆప్షన్‌ని క్లిక్ చేయగానే.. ఇచ్చిన ఫోటో పోలికలతో కోరుకున్న చిత్రం కళ్ల ముందు కనిపిస్తుంది. ఫొటోల విషయం ఎలా ఉన్నా.. నచ్చిన రూపాల్లోనూ, కథల్లోని అందమైన పాత్రల్లోనూ చిన్నారుల ముఖాలు ప్రత్యక్షమైతే.. చూడ్డానికి మనకెంత మురిపెంగా ఉంటుందో.. పిల్లలకంత సరదాగానూ ఉంటుంది. 

జీబ్లీ ట్రెండ్..

కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో నవ్వులు తెప్పిస్తాయి. పసి పిల్లల నవ్వులు.. కేరింతలు.. చూస్తే ఆనందానికి హద్దులుండవు. అయితే పెద్ద వయసుకు వచ్చిన చాలామందికి మళ్లీ బాల్యానికి వెళ్లి అల్లరి చేయాలని కోరిక ఉంటుంది.

ఆ కోరిక ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా పిల్లాడిలా మారిపోయి ఆ అనుభూతి పొందకపోయినా.. ఏఐ జనరేటెడ్ క్యూట్ బేబీ వీడియోలను చూసి సంబరపడవచ్చు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. 

దేశాధినేతలు.. సినీతారలు

ప్రపంచ దేశాధినేతల నుంచి సినీతారల వరకు వారి ముఖాలతో చేసిన పసిపిల్లల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చి, ఏఐ రాజ్యమేలుతోన్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. పండు ముసలివాళ్లను కూడా పసి పిల్లాడిలా తయారు చేసి, అల్లరి చేయిస్తుంది. ఇలా అనేక అనుభూతులను ఏఐ మిగుల్చుతున్నది. 

క్యూట్ వీడియోలు..

కొన్ని రోజుల క్రితం వరకూ జీబ్లీ స్టుల్ తెగ వైరలైంది. చాట్ జీపీటీ సాయంతో తమ ఫొటోలను జీబ్లీ ట్రెండ్‌లో మార్చుకుని మురిసిపోయారు. ఇప్పుడా ట్రెండ్ పాతదైపోయింది. ఆ స్థానాన్ని ఈ ఏఐ జనరేటెడ్ క్యూట్ బేబీ వీడియోలు కబ్జా చేశాయనే చెప్పవచ్చు. తమ ముఖాలతో ముద్దులొలికే చిన్న పిల్లాడి వీడియోలు చూస్తే చిరునవ్వు రావాల్సిందే.

ఏఐకి ఫిదా..

రష్యా ఉద్రికత్తల గురించి ఇటీవల అల్బేనియాలో యురోపియన్ సమిట్ నిర్వహించారు. ఎంతో సీరియస్‌గా జరుగుతున్న చర్చ మధ్యలో ఆసక్తికర సన్నివేళం చోటు చేసుకుంది. పలు ప్రపంచ దేశాధినేతలకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ వీడియోలను అక్కడ ప్రదర్శించారు. దీంతో పసిపిల్లల్లాంటి తమ ముఖాలను చూసి వారు సంబురపడ్డారు.

ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో సహా ఇతర ముఖ్య నేతలు పసి పిల్లల్లా మారి లోక్ సభలో ప్రసంగిస్తున్నట్లుగా ఉండే ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. 

పలు సినిమాల్లో బ్రహ్మానందం, మహేశ్‌బాబు అలరించిన పలు సన్నివేశాలనూ ఇలా మార్చేశారు. ఆయా వీడియోలకు కుప్పలుగా లైక్స్ వస్తున్నాయి. దీంతో వాటిని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నాయి.

ఎలా చేస్తున్నారు?

చాట్ జీపీటీలో పసి పిల్లాడిలా ఉండే ఫొటో క్రియేట్ చేసుకోవాలి. ఎవరి వీడియో కావాలో వారి ఫొటో అప్‌లోడ్ చేసి ‘ప్రాంప్ట్’ ఇవ్వగానే చిన్నపిల్లాడి ఫొటో వస్తుంది. ప్రత్యేకించిన ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఆడియోను జత చేయాలి. ‘ప్రాంప్ట్’ ఇవ్వగానే బుజ్జాయి వీడియో ప్రత్యక్షమవుతుంది. 

ఏఐతో ఉపయోగాలు

ఏఐ చక్కగా గణాంకాలు విశ్లేషించగలదు. కానీ మానవ సంబంధాలను నిర్మించలేదు. సహానుభూతి, టీమ్ వర్క్, కస్టమర్ కనెక్షన్ వంటి నైపుణ్యాలు ప్రత్యేకమైనవి. మీ విలువను పెంచే ఈ నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఉదాహరణకు విద్యార్థులకు ఏఐ పాఠాలు బోధించగలదు. 

కొత్తగా ఆలోచించడం, సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని పెంచుతుంది. 

ఆన్‌లైన్‌లో స్వల్పకాలిక ఏఐ కోర్సులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే విద్యార్థులు, ఇప్పటికే వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఏఐ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. 

చాట్ జీపీటీ, క్యారెక్టర్, ఏఐ, గూగుల్ బార్డ్ వంటి చాట్‌బాట్‌లు, క్విల్‌బాట్, నొవెల్ ఏఐ వంటి ఏఐ రైటింగ్‌లు, క్యాప్‌కట్, మిడ్‌జర్నీ వంటి ఇమేజ్ జనరేటర్‌లు, హగ్గింగ్ ఫేస్ (డేటా సైన్స్), సివిట్ ఏఐ మొదలైన ఏఐ టూల్స్‌ను వాడకంలో నైపుణ్యాన్ని సాధించవచ్చు.

రోజువారీ జీవితంలో ఈ యాప్స్ సాయం తీసుకోవచ్చు. వీటిని ఉపయోగిస్తూ మెయిల్‌లో సందేశాలు రాయడం వంటి చిన్న టాస్క్‌లను చేయడం. ఉద్యోగంలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దించేందుకు ఇది దోహదపడుతుంది.