calender_icon.png 20 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలు

20-08-2025 01:41:02 AM

- మంత్రి పొన్నం ప్రభాకర్

-అధికారులతో సమన్వయ సమావేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 19 (విజయక్రాంతి): హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఈసారి గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎంసిఆర్ హెఆర్‌డిలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దయానంద్, డీజీపి డాక్టర్ జితేందర్, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్, బాలాపూర్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 6 వరకు గణేష్ ఉత్సవాలు సజావుగా జరిపేందుకు నిర్వాహకులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు గణేష్ ఉత్సవాల ప్రతిష్టాపన, నిర్వహణ, నిమజ్జనం సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

పోలీసులు, విద్యుత్, అగ్ని మాపక శాఖ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. నిర్వహకులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండపం వద్ద విద్యుత్ ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని విద్యుత్ అధికారులకు మంత్రి సూచించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల నిర్వహణలో జీహెఎంసీది అతిపెద్ద బాధ్యత అని అన్నారు. వేడుకల్లో జీహెఎంసీ చేస్తున్న ఏర్పాట్లపై కమిషనర్ సమావేశంలో సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు.

క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఉత్సవ సమితి సభ్యులు లిఖిత పూర్వ కంగా తనకు గాని, కమిషనర్‌కు గానీ తెలియజేస్తే పరిష్కరిస్తామని అన్నారు. డీజీపి జితేందర్ మాట్లాడు తూ.. ఉత్సవాలలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం, సహకారంతో వేడుకలు నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే గణేష్ ఉత్సవాలలో జీహెఎంసీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాలు, జాతీ య రహదారుల్లో గుంతలు పూడ్చడం, రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు గణేష్ మండపాలకు గత సంవత్సరంలాగే ఉచిత విద్యుత్ అందిస్తామని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. 

గణేష్ నిమజ్జన కార్యాచరణ గైడ్ ఆవిష్కరణ

గణేష్ ఉత్సవాలలో ప్రభుత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం, సహకారం, సమాచారం పెం పొందించే ఉద్దేశంతో జిహెఎంసి ప్రత్యేకంగా రూపొందించిన గణేష్ నిమజ్జన కార్యాచరణ” గైడ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, కమిషనర్ కర్ణన్ ఆవిష్కరించారు.