08-08-2025 12:02:29 AM
- జాగ్రత్తగా గమనించుకోవాలి.. లేకుంటే ముప్పే
- కామినేని ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ దేశ్ముఖ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): చాలామంది మధ్యవయస్కు లు తమకు వచ్చినది గ్యాస్ట్రిక్ సమస్యా.. గుండెనొప్పా అన్న విషయం తెలియక ఇబ్బంది పడుతున్నారని, రెండింటికీ లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్ అన్నారు. నిర్లక్ష్యం చేస్తే ముప్పేనని హెచ్చరించారు. ముఖ్యంగా 40 ఏళ్ల మధ్యవారిలో ఇవి తీవ్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు.
గురువారం డాక్టర్ ఏ రవికాంత్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డాక్టర్ రిషిత్ బత్తిని కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, డాక్టర్ సురేష్ కుమార్ చీఫ్ కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. “చాలా సందర్భాల్లో అల్సర్ వల్ల గానీ, జీఈఆర్డీ (గ్యాస్ట్రో యూసోఫోగల్ రిఫ్లక్స్ డిసీజ్) వల్ల వచ్చే లక్షణాల్లో చాలావరకు గుండెనొప్పి లక్షణాలే ఉంటాయి. అయితే.. వయసు, మధుమేహం, రక్తపోటు లాంటి వాటిని బట్టి కూడా వారికి వచ్చింది గుండెనొప్పేమోనని అనుమానించాలి.
గుండె సమస్యలను గుర్తించడం ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. అందువల్ల వైద్యులు, ముఖ్యంగా జనరల్ ఫిజిషియన్లు కూడా హైరిస్క్ రోగుల్లో గ్యాస్ట్రిక్ సమస్య అని వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలాంటి సమస్య మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మందులు నెల రోజులు వాడినా సమస్య తగ్గకపోతే వెంటనే గుండెవైద్య నిపుణులను సంప్రదించాలి. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కొంత చొరవ చూపించాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.