08-08-2025 01:24:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో భారీగా ఓట్ల చోరీ జరుగుతుందని ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చిన ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గురువారం అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. బీజేపీతో కుమ్మక్కైన కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజవర్గాల్లో భారీ గా ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ చెప్పుచేతల్లోనే ఎన్నికల కమిషన్ ఉందని, వారు చెప్పినట్టే ఈసీ నడుచుకుంటుందని దుయ్యబట్టారు.
కాంగ్రె స్ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో గెలిచిన ఎంపీ స్థానాల్లో సైతం నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని, దీనికి ఎన్నికల కమిషన్ పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు 40 లక్షల డూప్లికేట్ ఓట్లను ఈసీ చేర్చిందని విమర్శించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ‘ఓట్ చోర్ హై’ పేరుతో ప్రెస్‌మీట్ నిర్వహించా రు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఐదు మార్గాల్లో ఓట్ల చోరీ జరుగుతుందని, అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలిపారు.
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని మహదేవ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం లోనే లక్షకు పైగా ఓట్ల గోల్‌మాల్ జరిగిందన్నా రు. మహదేవ్‌పుర నియోజకర్గంలో 6.5 లక్షల ఓట్లకు గానూ లక్ష ఓట్లు.. నకిలీవి, తప్పుడు చిరునామావేనని తమ పరిశోధనలో తేలిందని పేర్కొ న్నారు. ఐదు రకాలుగా ఓట్లను మార్చి అందరిని బురిడీ కొట్టించారన్నారు. నకిలీ ఓటర్లు, తప్పుడు అడ్రస్‌తో ఓటర్లు, ఒకే అడ్రస్‌పై భారీగా ఓట్లు, తప్పుడు ఫొటోలు, పారం దుర్వినియోగం ద్వారా లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియల్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు ఉంటున్నాయని, దీంతో తనకు సందేహం వచ్చి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆధారాలు సంపాదించినట్టు తెలిపారు. ఓట్ల చోరీ కారణంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తమ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు మధ్య కేవలం నాలుగు నెలలే ఉందని, ఈ కాలంలో ఏకంగా కోటి ఓట్లు పుట్టుకొచ్చాయని తెలిపారు.
సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లు కనిపించలేదని, ఆ తర్వాత మాత్రం భారీగా పోలింగ్ జరిగినట్టు అధికారులు ప్రకటించారని తెలిపారు. నిజాలు తెలుసుకునేందుకు ఆ బూత్‌ల సీసీ కెమెరాలు పరిశీలిద్దామని వెళితే అవి ధ్వంసమయ్యాయన్నారు. సాయంత్రం వరకు రాని ఓటర్లు 5 గంటల తర్వాత మాత్రం ఎందుకు కుప్పలుతెప్పలుగా వచ్చి ఓట్లేశారో సమాధానం చెప్పాలన్నారు. నిజానికి వచ్చినవారిలో ఎవరు అసలు ఓటర్లు కాదని.. తప్పుడు అడ్రస్‌లు, ఒకే పేరుతో నకిలీ ఓటర్లను సృష్టించి ఓట్లు గుద్దించారని రాహుల్ ఆరోపించారు.
ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా నకిలీ ఓట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందని రాహుల్ తెలిపారు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లలో 1,00,250 నకిలీ ఓట్లు ఉన్నాయని తేలిందన్నారు. మహదేవపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 6,26, 208 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 6,58, 915 ఓట్లు వచ్చాయన్నారు.
దాదాపు లక్షా 14వేల ఓట్ల తేడాతో తమ అభ్యర్థి ఓడిపోయినట్టు రాహుల్ తెలిపారు. అయితే ఇందులో 1,00,250 ఓట్ల చోరీ జరిగిందని.. అందులో 11, 965 డుప్లికేట్ ఓటర్లు, 40,009 తప్పుడు అడ్రస్‌లతో, 10, 452 ఓట్లు ఒకే అడ్రస్ లేదా బల్క్ అడ్రస్‌లతో, 4132 తప్పుడు ఫొటోలు ఉన్న ఓటర్లు, మరో 33, 692 ఓటర్లు ఫారం దుర్వినియోగం చేశారని రాహుల్ వెల్లడించారు.
తమ అంతర్గత పోల్స్‌లో కర్ణాటకలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామని తేలిందని, కానీ తొమ్మిది స్థానాల్లోనే తమ కూటమి అభ్యర్థులు గెలిచారన్నారు. దీంతో అనుమానం వచ్చి మహదేవపురపై దృష్టి పెడితే అసలు విషయం బయటపడిందని రాహుల్ తెలిపారు.
సింగిల్ రూంలో 80 మంది నివసిస్తున్నారా?
మహదేవపురలోని ఒక సెగ్మెంట్‌లో ఇంటి నంబ ర్ 35 ఒక సింగిల్ రూం అని.. ఈ అడ్రస్ పేరుతో 80 ఓట్లు నమోదయ్యాయని రాహుల్ తెలిపారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోనూ.. ఆ ఇంటి నంబర్‌పై నమోదైన ఓట్ల వివరాలను సమగ్రంగా బయటపెట్టారు. ఈ ఓట్లన్నీ పోలింగ్ బూత్ నంబర్ 470 పరిధిలోకి వస్తాయని వివరించారు. అయితే ఒక్క సింగిల్ రూంలోనే 80 మంది ఎలా నివసిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
అలాగే ఇంటి నంబర్ 791 ఒక సింగిల్ బెడ్ రూం. ఈ అడ్రస్ కింద 46 ఓట్లు ఉన్నాయని, ఇది పోలింగ్ బూత్ నంబర్ 366 పరిధిలోకి వస్తుందని రాహుల్ ఒక వీడియో ద్వారా చూపించారు. అంతేకాదు ‘సున్నా’ హౌస్ నంబర్ పేరుతోనూ ఓట్లు పడ్డాయని వివరించారు. వాటిలో ఎవరూ ఉండటం లేదని తేలిందని, ఇవన్నీ దొంగ ఓట్లేనని రాహుల్ మండిపడ్డారు.
అదంతా బోగస్..
మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక ఇలా ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ భారీగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. కానీ అంతకుముందు రాని ఓటర్లు అప్పటికప్పుడు పెరగడం కూడా తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు ఆరు నెలలు పట్టిందన్నారు.
ఈ సందర్భంగా ఈసీకి రాహుల పలు ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ఎందుకు పెరిగింది? అన్న దానిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలన్నారు. ఓట్ల దొంగతనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నలు అడిగితే ఇప్పటివరకు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదన్నారు.
మహారాష్ట్రలో గెలిచేందుకు 40 లక్షల డూప్లికేట్ ఓట్లు
మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఓట్లను ఈసీ దొంగిలించింద ని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత చాలా ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కు చాలా తేడా ఉందని, మహారాష్ట్రలో గెలిచేందుకు 40 లక్షల డూప్లికేట్ ఓట్లను చేర్చారని విమర్శించారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో గెలిచిన ఎంపీ స్థానాల్లో సైతం నకిలీ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని, దీనికి పూర్తిగా ఎన్నికల కమిషన్ మద్దతు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే తాము అడిగిన ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని, అనేక ప్రాంతాల్లో ఓటింగ్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని విమర్శించారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 30 స్థానాలు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం 5 నెలల తర్వాత అదే మహారాష్ట్రకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ 50 సీట్లు కూడా గెలవలేకపోవడం విడ్డూరంగా అనిపించిదన్నారు.
కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మహారాష్ట్రలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఓటర్ల జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని, అది దేశ సంపద.. మరి దానిని ఈసీ ఎందుకు చూపించట్లేదని రాహుల్ ప్రశ్నించారు. ఇలా చూసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలనై హర్యానా, మధ్యప్రదేశ్‌లోనూ భారీగా ఓట్ల చోరీ జరిగిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయన్నారు.
బీజేపీపై వ్యతిరేకత ఏర్పడిన రాష్ట్రాల్లోనే ఓట్ల చోరీ
బీజేపీ అధికారంలో ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడ్డ రాష్ట్రాల్లో భారీగా ఓట్ల చోరీ జరుగు తుందని రాహుల్ తెలిపారు. బీహార్‌లో లక్షల మంది ఓట్లను తొలగించారని, బీహార్‌లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందన్నారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ మరోసారి మండిపడ్డారు.
దొంగ ఓట్లపై ఆధారాలివ్వండి: కర్ణాటక ఈసీ
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదైనట్టు ఆధారాలు సమర్పించాలని కర్ణాటక ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది. తగిన ఆధారాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల జాబితా చాలా పారదర్శకంగా తయారు చేసినట్టు చెప్పింది. ఎన్నికల ఫలితాలను కోర్టులో మాత్రమే సవాల్ చేయాలని సూచించింది. ఈ మేరకు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కర్ణాటకలో ఎంపీ ఎన్నికల ఫలితాలను ఇప్పుడు సవాల్ చేయలేమని స్పష్టం చేశారు.
రాహుల్‌వి సిగ్గులేని వ్యాఖ్యలు: రవిశంకర్ ప్రసాద్
ఎన్నికల కమిషన్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, సిగ్గులేనివిగా ఉన్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఏమి మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదన్నారు. నరేంద్ర మోదీ 2015 నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని.. ఆయన పని, నిజాయితీకి మెచ్చి దేశ పురోగతి కోసం ఓటు వేసిన ప్రజలను రాహుల్ అవమానిస్తున్నారన్నారు.
పరువు నష్టం కేసుల్లో బెయిల్ కోసం దేశవ్యాప్తంగా తిరుగుతున్న రాహుల్ ఈసీ.. బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయనడం హాస్యాస్పదమన్నారు. అధికారం కోల్పోయిన బాధలో రాహుల్ గాంధీ తన జీవితంలో పూర్తి ప్రశాంతతను కోల్పోయారని, పదే పదే ఎన్నికల సంఘంపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.