08-08-2025 01:03:28 AM
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో బీఆర్‌ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోందని.. రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటూ బీజే పీ, బీఆర్‌ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్‌ఎస్, 50 శాతం పరిమితి మించుతుందంటూ బీజేపీ అడ్డుకొనే కుట్ర చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
ఢిల్లీలోని తన అధికారిక నివాసం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువా రం మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాదిలోనే కులగణన చేపట్టిందన్నారు. దాని ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను శాసనసభలో ఆమోదించిందని సీఎం తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్ట సవరణకు తాము ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్‌కు పంపామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ మూడింటికి ఆమోదముద్ర వేయాల్సిన గవర్నర్ వాటిని రాష్ర్టపతికి పంపారని సీఎం పేర్కొన్నారు. ఆ బిల్లులను ఆమోదించాలని కోరేందుకు తాము రాష్ర్టపతి ద్రౌపది ముర్మును పది రోజుల క్రితమే అపాయింట్‌మెంట్ కోరామని.. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ర్టపతిని కలిశారన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే తమకు అపాయింట్‌మెంట్ లభించలేదని భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
బీజేపీది తొలి నుంచి బీసీ వ్యతిరేక వైఖరేనని.. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకొనేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది ఆ పార్టేనని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఇక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని సీఎం విమర్శించారు.
అయినప్పటికీ నాటి మన్మోహన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీఆర్‌ఎస్ బీజేపీతో అంటకాగుతుందని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించుకొ నేందుకు మూడు రోజులుగా ఢిల్లీలో ప్రయత్నం చేశామని, ఇందుకోసం మంత్రులు సైతం ఢిల్లీలోనే ఉన్నారని సీఎం తెలిపారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము వెంటనే తెలంగాణ గవర్నర్ పంపిన బిల్లులను ఆమోదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
బిల్లు ల ఆమోదానికి జంతర్‌మంతర్‌లో తాము చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు హాజరై మద్దతుగా నిలిచారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ బిల్లులపై చర్చకు వాయిదా తీర్మానాలు ఇస్తే, ప్రభుత్వం తోసిపుచ్చుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వపరంగా చిత్తశుద్ధితో అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేశామని, కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశామని, ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని సీఎం వెల్లడించారు.
మోదీ రాష్ర్టంలో రిజర్వేషన్లు లేవా?
బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బీజేపీ వితండవాదం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాము రాష్ర్టపతి ఆమోదం కోసం పంపిన బిల్లుల్లో ఏదైనా మతానికో, కులానికో రిజర్వేషన్ ఉందా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశంపై అవగాహన లేక కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారు చట్టాన్ని చదివారో లేక రాజకీయ ప్రేరేపిత ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తనకు తెలియడం లేదన్నారు.
ఎన్నికల్లో కులాలు, ఉపకులాల రిజర్వేషన్లు ఎక్కడా లేవని, ఇప్పటివరకు అలా జరగలేదని, అయినా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నామని వారు వితండవాదం చేస్తున్నారు. అందుకే సూటిగా అడుగుతున్నా. 2017లో రాజస్థాన్ నుంచి అబ్దుల్ సత్తార్ అనే వెనకబడిన ముస్లిం యువకుడు ఓబీసీ రిజర్వేషన్ కోటాలో యూపీఎస్సీలో ర్యాంక్ సాధించాడు.
1971 నుంచి నూర్ బాషా, దూదేకుల, వివిధ వృత్తులను చేపట్టిన ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న మహారాష్ర్టలో ఉన్నాయి, మోదీ జన్మించిన గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తు న్న ఉత్తర్‌ప్రదేశ్ లో ఉన్నాయి. మీరే కేంద్రంలో అధికారంలో ఉండి ఆ రాష్ట్రాల్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లకు అనుమతిస్తున్నారు.
ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చానని నరేంద్రమోదీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేవు. మేం అలాంటి రిజర్వేషన్లు చేయలేదు. అయినా వాళ్లు వితండవాదం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
బీజేపీతో అంట కాగుతున్నారు
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్‌ఎస్ వైఖరిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. ‘ఎలాగైనా కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి బీజేపీతో వారు అంటకాగుతున్నారు. బీజేపీ చేస్తున్న తప్పిదాలను బీఆర్‌ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మేం జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. తాటి చెట్టంత పెరిగితే సరిపోదు.
ఆవగింజంత అవగాహన కూడా ఉండాలి. మా చేతులు కట్టేసేలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తుంది తప్ప బీసీలకు మద్దతు ఇవ్వాలన్న సోయి లేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను బీసీ ద్రోహులుగా, వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తోంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించారని అనుకోవచ్చు.
కానీ ఏ సమస్యనైనా దీర్ఘకాలికంగా సాగదీస్తే అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి. లేదంటే బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
రిజర్వేషన్లు కావాలంటే మోదీని గద్దె దించాలి
2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిందని, మళ్లీ రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం తాను నిజాలు చెబుతానని సీఎం తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమేనని సీఎం తెలిపారు.
విలేకరుల సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీ, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, రామసహాయం రఘురాంరెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, జాటోత్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, వెడ్మ బొజ్జు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, టీ రామ్మెహన్‌రెడ్డి, బుయ్యాని మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నాడు..
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాదనలు చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సామాజిక న్యాయశాఖ మంత్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ తీసుకొని వస్తే ఆయనకు కావాల్సిన వివరాలన్ని అందిస్తామని, లేకుంటే ఆయన సమయం చెబితే తామే ఢిల్లీ వచ్చి అన్ని గణాంకాలు అందజేస్తామని సీఎం ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ముస్లింలు ముఖ్యమంత్రులు కావొద్దనేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు.
ముస్లింలను రాష్ర్టపతులు, పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని సీఎం తెలిపారు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారని, ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో చేసి చూపాలని బీజేపీ నేతలకు సీఎం సూచించారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇందిరాభవన్‌లో తెలంగాణ కులసర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నాలుగు గంటలు సావధానంగా విన్నారని, వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని తలకటోరా స్టేడియంలో జాతీయ స్థాయి సదస్సు పెట్టి వివరించారని సీఎం పేర్కొన్నారు. శిబుసోరెన్ అంత్యక్రియలు, ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్‌మంతర్ సదస్సుకు హాజరుకాలేదని సీఎం ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపైన బీజేపీకి చిత్తశుద్ధి లేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అన్నారు.