కోచ్ కష్టం కాదు ఇష్టమే
దుబాయ్: జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడాన్ని ఇష్టపడతానని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించి ఆ జట్టు మూడోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్ టూర్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తవుతుండగా.. ఆ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత జట్టుకు కోచ్‌గా ఉండటానికి ఇష్టపడతా. జాతీయ జట్టుకు కోచ్ కావడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 కోట్ల మంది భారతీయుల ఆశలకు అది కీలక స్థానం’ అని పేర్కొన్నాడు. కొత్త కోచ్‌ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆ గడువు ముగిసినా గంభీర్ అప్లు చేసుకున్నాడా లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత కరువైంది. ఐపీఎల్ ఫైనల్ అనంతరం బోర్డు కార్యదర్శి జై షా.. గంభీర్‌తో చర్చించడం, గౌతమ్ మంచి కోచ్ అవుతాడని గంగూలీ అన్న నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా అతడి ఎంపిక లాంఛనమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






