calender_icon.png 6 December, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ పదవికి వేలం

05-12-2025 11:49:52 PM

- పాండవపురంలో 35 మందిపై కేసు

సిద్దిపేట క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నిక గురించి పాండవపురం (బొగ్గులోనిబండ) గ్రామంలోని పెద్దమ్మ గుడిలో కొందరు గ్రామస్తులు నిబంధనలకు విరుద్ధంగా సమావేశమయ్యారని తెలుసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. గ్రామ  సర్పంచ్ గా అందె శంకర్, బైరి కనకయ్య, అందె ఆంజనేయులు నామినేషన్ వేశారు. గత నెల 29 న ఇదే స్థలంలో సమావేశమై సర్పంచ్ గా ఎన్నుకోవడానికి వేలం నిర్వహించారు.

పెద్దమ్మ దేవాలయ కమిటీ, పెద్ద మనషుల సమక్షంలో వేలం నిర్వహించి సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోడానికి తీర్మానించారు. వేలంలో అందె శంకర్ రూ.16లక్షల 30 వేలు అధికంగా పాడి ఈనెల 1న నామినేషన్ దాఖలు చేశాడు. అదే రోజు కుల పెద్దమనిషి బైరి కనకయ్యకు రూ.లక్ష ముట్టజెప్పాడు. 4న రూ.10 లక్షల చెక్కు కమిటీ క్యాషియర్ అందె ఆంజనేయులుకు అప్పగించాడు. ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న బైరి రాజు అనే వ్యక్తి  తీర్మానానికి వ్యతిరేకంగా నామినేషన్ వేశాడు.

ఈ విషయమై శుక్రవారం కుల సంఘం పెద్దలు సమావేశమై రాజును కుల బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఎస్టీ ఇన్చార్జి వంశీకృష్ణ అక్కడికి వెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు అందె శంకర్, బైరి రాజు, అందె ఆంజనేయులు, అందె కనకయ్య, కుల సంఘం పెద్ద మనుషులు, దేవాలయ కమిటీ సభ్యులు సహా 35 మందిపై కేసు నమోదు చేశామని సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. వారి నుంచి 9 బైకులు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.