23-12-2025 09:22:53 PM
గ్రామస్తులకు దుప్పట్లు, స్వెటర్లు, చిన్నారులకు ప్లేట్లు, పలకలు పంపిణీ
మరోసారి సేవా నిరతినీ చాటిన హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు
మణుగూరు,(విజయక్రాంతి): మండలంలోని మారుమూల గిరిజన గ్రామం విప్పలగుంపులో మంగళవారం భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నెలకొల్పిన హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు గ్రామస్తులపై ఔదార్యం చూపారు. చలికాలంలో గజ గజా వణుకుతున్న చిన్నారులు, వృద్ధుల పరిస్థితిని గమనించి గ్రామస్తులకు దుప్పట్లు, స్వెటర్లు, చిన్నారులకు ప్లేట్లు,పలకలు పంపిణీ చేసి తమ సేవానిరతినీ మరోసారి చాటరు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ భూక్యా బిచ్చన్న హాజరయ్యారు. ముందుగా గ్రామస్థులు ఆయనకు ఆదివాసీ సాంప్రదాయంలో కొమ్ము, కోలాట నృత్యాలతో స్వాగతం పలకగా, మహిళలు పూలవర్షంతో స్వాగతించారు. ఈ సందర్భంగా సభావేదికపై ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ కుంజా శ్రవణ్ కుమార్, సామజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి, సామాజిక సేవకులు కర్నె బాబురావు మాట్లాడారు. అనంతరం చీఫ్ ఇంజనీర్ బుచ్చన్న మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో హెల్పింగ్ హాండ్స్ టీం సభ్యుల కృషిని ప్రశంసించారు. విప్పల గుంపు గ్రామాన్ని సందర్శించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
తాను కూడా నిరుపేద కుటుంబం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలలో ఉన్నానని, ప్రతి పేదింటి బిడ్డ కష్టాలు తనకు తెలుసునన్నారు. బీటీపీ ఎస్ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉన్న, సామాజిక కోణంలో తోటి వారికి సహాయం అందించేందుకు ముందు వరుసలో నిలవడం సంతోషకర మన్నారు. ఆదివాసి గిరిజన గ్రామ ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని, హ్యాండ్స్ టీం సభ్యులు సహాయాన్ని అందించేందుకు ముందు వరుసలో గ్రామస్తులకు హామీనీచ్చారు. అనంతరం విప్పలగుంపు, ఎస్టీ కాలనీలకు చెందిన 90 కుటుంబాలకు ప్రతి ఇంటికి మూడు రగ్గులు, చిన్నారులకు స్వెటర్లు, మంకీ క్యాప్స్ ను పంపిణీ చేశారు.
గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఆయన చిన్నారులకు పలకలను, భోజన ప్లేట్లను, గ్లాసులను, బోర్డును, సీలింగ్ ఫ్యాన్, ప్యూరిఫై వాటర్ ట్యాంకును పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి కావలసిన మౌలిక వసతులను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రహరీ, రేకులు, ఇతర అవసరాలను గుర్తించి అంచనాలను రూపొందించా లని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు, పవర్ ప్లాంట్ ఏడిఏ, డివి జనల్ ఇంజనీర్స్, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, విప్పల గుంపు గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.