ఘర్ వాపసీ మొదలైంది!
l అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యం: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
l కాంగ్రెస్‌ను వీడిన వారు తిరిగి సొంతగూటికి..
l పార్టీలో చేరిన వారిలో మాజీ మంత్రి సంభాని, ఇతర నాయకులు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఘర్‌వాపసీ మొదలు పెట్టామని, రెండు రోజుల నుంచి పార్టీలోకి ఎంతోమంది చేరారని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఆ పార్టీ నాయకులు సంగిశెట్టి జగదీష్, ఎడవెలి కృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. వారికి జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వివిధ కారణాలతో ఎంతోమంది కాంగ్రెస్‌ను వీడారని, వారంతా తిరిగి సొంత గూటికి వస్తున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిని కూడా కాంగ్రెస్‌లోకి వస్తామంటే చేర్చుకుంటానని స్పష్టం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తామంటే చేర్చుకుంటామన్నారు. ఇదే విషయాన్ని మంత్రి దామోదర రాజనరసింహాకు కూడా చెప్పినట్లు వెల్లడించారు. తమకు పదవులు ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమేనన్నారు. వారి నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. బీజేపీ విషయంలో మైనార్టీ వర్గాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ఇప్పటికే మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన వెంట మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, పార్టీ నేత రామచంద్రనాయక్ ఉన్నారు.






