నాడు ఘనం.. నేడు మౌనం!
l ఇవాళ బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
l ఎక్కడా కనిపించని బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల ఉత్సాహం
l పార్టీ కార్యాలయాలకే పరిమితమైన గులాబీ జెండా
l నిరుత్సాహంలో పార్టీ మండల, గ్రామ స్థాయి నేతలు
l లోక్‌సభ ఎన్నికల్లో అధికారపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యమేది?
l పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ప్రశ్నిస్తున్న క్యాడర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా 2001లో ఏప్రిల్ 27న జలదృశ్యంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 23 ఏళ్లు పూర్తి చేసుకుని, 24వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఏటా నిర్వహించినట్టు అట్టహాసంగా వార్షిక వేడుకలు నిర్వహిస్తుందని పార్టీ శ్రేణులంతా భావిస్తే జిల్లా కార్యాలయాల్లో స్థానిక నేతలు జెండా ఎగరేసి వేడుకలు జరపుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీవిని ఎరుగని రీతిలో వేడుకలు నిర్వహించిన పార్టీ పెద్దలు అధికారం కోల్పోయిన తర్వాత వేడుకలను నామమాత్రంగా నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన విధంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో ధైర్యం నింపి అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీని ఎదుర్కొనేలా ఉత్సాహం నింపుతారని భావించారు. కానీ కొందరు మాత్రమే వేడుకలు నిర్వహించడం పార్టీ ఇమేజీని దెబ్బతీయడమే అని మండల స్దాయి నాయకులు పెదవి విరుస్తున్నారు.
ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని..
తెలంగాణలోని పలు సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం నడిపి, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న టీఆర్‌ఎస్ ఆ సమయంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా మార్పు చెందింది. తొలి ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో రెండోసారి కూడా విజయం సాధించి కేసీఆర్ సీఎం పదవిని చేపట్టారు. 2022లో టీఆర్‌ఎస్‌ను భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. మొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేరగా, తొలి నుంచీ కేసీఆర్ వెన్నంటి ఉన్న పలువురు నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీని వీడారు.
బస్సు గుర్తు నుంచి కారు వరకు
2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆయనకు బస్సు గుర్తు కేటాయించింది. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు నాగలి గుర్తు కేటాయించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కారు గుర్తును కేటాయించగా, ఆ ఎన్నికల్లో 5 ఎంపీ సీట్లు, 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి ఎన్నికల కమిషన్ టీఆర్‌ఎస్‌కు శాశ్వతంగా కారు గుర్తును కేటాయించింది. పార్టీ స్థాపించి 23 ఏళ్లు గడిచాయి. 60లక్షల సభ్యత్వాలు ఉన్నా.. ఇప్పటివరకు రాష్ట్ర కార్యవర్గం మినహా మండల, గ్రామ కమిటీలు పూర్తి స్ధాయిలో ఏర్పాటు చేయలేదు. ఇన్‌చార్జులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అవిర్భావ వేడుకల నిర్వహణలో టాప్
పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు అవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈస్ధాయిలో అప్పట్లో అధికారం చేపట్టిన పార్టీలు కూడా నిర్వహించలేదు. 2002లో మొదటి సభ ఉద్యమాల గడ్డ నల్లగొండ జిల్లాలో నిర్వహించగా, రెండవ సభ వరంగల్‌లో అట్టహాసంగా నిర్వహించారు. 2004లో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో మూడోసారి ఆవిర్భావ వేడుకలు జరపలేదు. 2005 నుంచి 2013 వరకు ఆవిర్భావ వేడుకలతో సభలు నిర్వహించి పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహపరిచి ఉమ్మడి పాలకులపై ఉద్యమించేలా కేసీఆర్ ఎంతో కృషి చేశారు. 2014 తర్వాత టీఆర్‌ఎస్ మొదటిసారిగా అధికారం చేపట్టడంతో ప్లీనరీ పేరుతో వేడుకలు అట్టహాసంగా నిర్వహించింది. ప్రతి గ్రామ నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేసింది.
విపక్ష పార్టీలను ఏవిధంగా ఎదుర్కొవాలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించి పార్టీ బలోపేతం కోసం శ్రమించాలంటూ సీఎం కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేసేవారు. 20వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 25న జరపగా, 21వ వేడుకలు అదే హెచ్‌ఐసీసీలో నిర్వహించారు. ఈ ఏడాది ఆవిర్భావ వేడుకలు కూడా అట్టహాసంగా నిర్వహిస్తుందని గ్రామ స్థాయి కార్యకర్తలు భావిస్తే పార్టీ కార్యాలయాలకే పరిమితం కావడంపై జిల్లా స్థాయి నేతలు పెదవి విరుస్తున్నారు.






