03-11-2025 02:17:53 AM
హోబార్ట్, నవంబర్ 2 : రెండో టీ ట్వంటీ ఓటమికి టీమిండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. హోబార్ట్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్(3/35) అదరగొడితే... బ్యాటింగ్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీంతో టీ ట్వంటీ సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఓటమి ప్రభావమో, విమర్శల వల్లనో ఏదైతేనేం టీ20 ఫార్మాట్‌లో బెస్ట్ బౌలర్‌గా ఉన్న అర్షదీప్‌సింగ్‌కు ఎట్టకేలకు తుది జట్టులో చోటు దక్కింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 3 మార్పులు చేసింది.
హర్షిత్ రాణా స్థానంలో అర్షదీప్ ను, సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేశ్ శర్మను, కుల్దీప్ ప్లేస్‌లో సుందర్‌ను తీసుకుంది. షార్ట్ ఫార్మాట్‌లో తనను అత్యుత్తమ బౌలర్‌గా ఎందుకు పిలుస్తారో అర్షదీప్‌సింగ్ ఆరంభంలోనే నిరూపించాడు. పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. అయితే టిమ్ డేవిడ్, స్టోయినిస్‌ను ఆస్ట్రేలియాను ఆదుకున్నారు. వీరిద్దరూ భారీ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.టిమ్ డేవిడ్ 74(38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్సర్లు), స్టోయినిస్ 64(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లు) చెలరేగగా.. చివర్లో మాథ్యూ షార్ట్ (26) ధాటిగా ఆడడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 186/6 స్కోర్ చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ 3/35, వరుణ్ చక్రవర్తి 2/33 రాణించారు.
ఛేజింగ్‌లో భారత జట్టు కూడా దూకుడుగానే ఆడింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో సూర్యకుమార్ యాద, తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించారు.పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న సూర్యకుమార్ 24 రన్స్‌కు ఔటవగా.. అక్షర్ పటేల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.ఈ దశలో తిలక్ వర్మకు వాషింగ్టన్ సుందర్ జత కలిసాడు. 12వ ఓవర్లో ఒక సిక్స్, 14వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది ఊపు తెచ్చాడు.
తిలక్ వర్మ ఔటైనప్పటకీ జితేశ్ శర్మతో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశా డు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరం లో నిలిచిపోయా డు. చివర్లో జితేశ్ శర్మ ఫోర్ కొట్టడంతో ఇం డియా 18.3 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. వాషింగ్టన్ సుందర్ కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 నాటౌట్, జితేశ్ శర్మ 13 బంతుల్లో 3 ఫోర్లతో 22 రన్స్‌తో అజేయంగా నిలిచారు. మూడు వికెట్లు తీసిన అర్షదీప్‌సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్‌లో నాలుగో టీ20 గురువారం గోల్డ్ కోస్ట్‌లో జరుగుతుంది.