10-10-2025 01:22:23 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : భారత యువ క్రికెటర్ రింకూసింగ్‌కు అండర్ వరల్డ్ దావూద్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు రావడం కలకలం రేపింది. రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనిపై రింకూ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు నిందితులు మహ్మద్ దిల్షద్, మహ్మద్ నవీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిని కరేబియన్ దీవుల్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రింకూకు మూడు బెదిరింపు కాల్స్ వచ్చా యి. ముందు నవీద్ తనను తాను అభిమానిగా పరిచయం చేసుకుని మెసేజ్ చేసినట్టు గుర్తించారు. తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుర్తుంచుకో డీ కంపెనీ అని మెసేజ్ చేసాడు.
పోలీసులు అరెస్ట్ చేసిన వీరిద్దరూ ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీని 10 కోట్లు డిమాండ్ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ పరిణామాలతో రింకూసింగ్‌కు భద్రత పెంచాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం రింకూ ఆస్ట్రేలియా పర్యటన కోసం సన్నద్ధమవు తున్నాడు.