07-09-2025 01:37:09 AM
గణేశ నిమజ్జనాలతో శనివారం రాష్ట్రమంతా సందడిగా మారింది. భాగ్యనగరంలో శోభాయాత్ర, వినాయక నిమజ్జనాలతో కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలే కాకుండా పల్లెల్లోని యువత, పిల్లలు నిమజ్జన కార్యక్రమంలో తలమునకలయ్యారు. ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ భక్తులు ఆనందోత్సాహాలతో వీధులవెంట గణనాథులను ఊరేగించడం అంతటా కనిపించింది.
గణేశ నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్‌లో సజావుగా సాగింది. నిమజ్జనాలకు ప్రధాన కేంద్రమైన ట్యాంక్‌బండ్, పక్కనే ఉన్న నెక్లెస్‌రోడ్.. ఇటువైపు శోభాయాత్రకు కేంద్రబిందువైనా మోజంజాహి మార్కెట్ ప్రాంతాలు జన సముద్రాన్ని తలపించాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 2,32,520 గణేశ ప్రతిమల నిమజ్జనం చేశారు. కాగా పది రోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణేశుడు శనివారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.