calender_icon.png 7 September, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల తాకట్టు పెట్టునా హామీలు నెరవేర్చుతాం

07-09-2025 01:31:12 AM

-అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం 

-బీఆర్‌ఎస్ హాయంలో రాష్ర్టం అప్పులపాలు

-కమీషన్ల కోసమే కేసీఆర్  కాళేశ్వరం కట్టారు

-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

-పలు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

-హాజరైన మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి

మహబూబ్‌నగర్/రంగారెడ్డి/గద్వాల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తల తాకట్టు పెట్టునా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మూడు విడతల్లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. శనివారం రంగారెడ్డి జిల్లా నం దిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామం, గద్వాల పట్టణ సమీపంలోని దౌదర్‌పల్లి వద్ద ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు మం త్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి పొంగులేటి హాజరయ్యారు.

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఉప్పరిపల్లి ప్రమీల  ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైన అన్ని సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి పదేళ్లు ప్రజలను మోసం చేసిం దని విమర్శలు గుప్పించారు.

రాష్ర్టంలో ఇప్పటివరకు తాము 7 లక్షల రేషన్ కార్డులు మం జూరు చేశామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మిస్తే భారీగా కమీషన్లు వస్తాయన్న దురాలోచనతోనే మాజీ సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును నిర్మించారని, అదే పేదలకు ఇళ్లు కట్టిస్తే కమీషన్లు రావన్న సాకుతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టలేదని ఆరోపించారు. మంత్రి వాకిటి శ్రీహరి మా ట్లాడుతూ.. 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్టును గాలికి వదిలేశారని విమర్శించారు.

పేదలకు ఇల్లు కట్టిస్తామని మాయా ప్రపంచాన్ని చూపించారని మండిపడ్డారు. కాలేశ్వరం పేరున లక్ష కోట్ల కమీషన్ దండుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి  షాద్ నగర్ ప్రాంతానికి సాగు తాగు నీరు తీసుకొస్తారని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్థికంగా రాష్ర్టం బాగ లేకపోయినా పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలనే  పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ అవినీతిపై కేసీఆర్ సొంత కూతురే బయట పెట్టిందన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అన్నారు.