07-09-2025 12:59:33 AM
-నకిలీ విత్తనాలతో మోసం చేసే కంపెనీలపై కఠిన చర్యలు
-త్వరలోనే సర్కార్‌కు ముసాయిదా ఇవ్వనున్న రైతు కమిషన్
-పెట్టుబడి, రైతు కష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకొని పరిహారం
-పంట సీజన్ పూర్తయ్యాక నష్టం జరిగితే వందశాతం జరిమానా
-సీజన్ మధ్యలోనే నష్టం జరిగితే 50 శాతం
-మొదట్లోనే ఇబ్బంది వస్తే 10 శాతం వరకు నష్టపరిహారం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో రైతులు నకిలీ, కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అన్నదా తలు ఒక సీజన్‌లో నష్టపోతే ఏడాదంతా కష్టాలు వెంటాడుతుంటాయి. పెట్టుబడి కోసం తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందితే.. పంట ఉత్పత్తి పెరుగుతుంది. అదే నకిలీ విత్తనమైతే పంట మొత్తం దెబ్బతింటుంది. అందుకోసం తెలంగాణలో నకిలీ విత్తనాల నుంచి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని తీసుకురావాలని ఎన్నో ఏండ్ల నుంచి డిమాండ్ ఉంది.
ఈ నేపథ్యంలో నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణ యం తీసుకుంది. నూతన విత్తన చట్టం విధివిధానాలను రూపొందించాలని రైతు కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్కార్ ఆదేశాలతో విత్తన చట్టంలో చట్టంలో ఉండాల్సిన అంశాలపై రైతు సంఘాలు, మేధావులు, వ్యవసాయ నిపుణులు, రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విత్తన చట్టాలను పరిశీలించింది. రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం రూపకల్పనకు రైతు కమిషన్ తీవ్ర కసరత్తు చేసింది. కాగా, రైతులను మోసం చేస్తే ఎవరికైనా కఠిన చర్యలు ఉం డేలా ఆ చట్టంలో నిబంధనలు పొందుపర్చారు.
నకిలీ విత్తనాలు, నకిలీ పరుగు మం దులతో రైతులు మోసపోతే.. వారికి విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందించింది. అక్కడితోనే ఆగకుండా కంపెనీలపై జరిమానా విధించడం, బాధ్యులకు జైలు శిక్ష పడేలా ప్రభుత్వం చట్టాన్ని తీసుకురాబోతుం ది. ఒక్కో పంటకు ఒక్కో రకంగా పరిహారం చెల్లించేలా ముసాయిదాలో నిబంధనలను రూపొందించారు. పంటకాలం, పెట్టుబడి, రైతు కష్టాన్ని పరిగణనలోకి తీసుకొని పరిహారం అందేలా చట్టాన్ని తీసుకురానుంది. ఈ రకంగా పంట సీజన్ పూర్తయ్యాక పంట నష్టం జరిగితే రైతుకు వందశాతం నష్టపరిహారం అందించేలా కఠిన నిబంధనలు పెట్టినట్టు తెలిసింది. సీజన్ మధ్యలో పంట నష్టం వాటిల్లినట్లు తేలితే 50 శాతం, విత్తనాలు వేసిన మొదట్లోనే దెబ్బతింటే 10 నుంచి 20 శాతం వరకు నష్టపరిహారం ఇవ్వాలనే నిబంధనను విత్తన చట్టంలో రూ పొందించినట్టు సమాచారం.
విచ్చలవిడిగా ప్రైవేట్ విత్తన కంపెనీలు..
నాణ్యమైన విత్తనాల ద్వారానే పంట ఉత్పత్తి పెరుగుతుంది. అదే విత్తనం నకిలీదైతే ఆ పంట మొత్తం దెబ్బతింటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రం నాణ్యమైన విత్తనాలు అందించడంలో ఏటా విఫలమవుతున్నాయి. దీంతో విచ్చలవిడిగా ప్రైవేట్ కంపె నీలు పుట్టుకొస్తున్నాయి. ఆ కంపెనీలకు, రైతులకు సంబంధం లేకుండానే థర్డ్ పార్టీ ద్వారా విత్తనాల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో పంట నష్టపోతే తమకు సంబంధం లేదన్నట్టుగా విత్తన కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. విత్తనం విక్రయిం చిన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పత్తి విత్తనాలతో రైతులు రూ.కోట్లల్లో నష్టపోయారు.
ఇటీవల ములుగు జిల్లాలో రైతులు వేసిన మొక్కజొన్న పంట మొత్తం విషపూరితమైంది. ఆ పంటను తిన్న పశువులు చనిపోవడమే కాకుండా రైతులు కూడా తీవ్ర అనారోగ్యపాలయ్యారు. రాష్ట్రంలో ప్రతి సీజన్‌లో ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే విత్తనం కొనేట ప్పుడు రైతులను నమ్మిస్తున్న కంపెనీలు, నష్టం జరిగినప్పుడు పరిహారం అడిగితే తమకేమి సంబంధమన్నట్టుగాగా తప్పించుకుంటున్నాయి. నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందనే కారణంతో విత్తన కంపెనీలు ముఖం చాటేస్తున్నాయి. అంతేకాకుండా నష్టపరిహారం విషయంలో న్యాయపరంగా అడిగే హక్కు రైతులకు లేకుండా పోయింది. ఒకవేళ విత్తన కంపెనీలు దయదలిచి ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. కానీ, న్యాయపరంగా పరిహారం అడిగే హక్కు రైతులకు లేకుండా పోయింది.
కార్పొరేట్ సంస్థలను నియంత్రించేనా?
రాష్ట్రంలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్ విత్తన కంపెనీలు పాగా వేస్తున్నాయి. పత్తి విత్తనంపై కార్పొరేట్ కంపెనీలపై ఆధిపత్యం కొనసాగుతోంది. అంతే కాకుండా కార్పొరేట్ విత్తన కంపెనీలకు కేంద్రం సహకారం కూడా ఉంది. అందుకు అనుగుణంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, ఆ చట్టాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరోక్షంగా అమలవుతున్నాయని తెలంగాణలోని రైతు సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన విత్తన చట్టం, ఆ కార్పొరేట్ కంపెనీలను నియంత్రించగలదా? ఆ కంపెనీలు ఈ చట్టాన్ని అమలు చేస్తాయా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతుతున్నాయి.