calender_icon.png 7 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్ల జేఎన్టీయూలో శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభించాలి

07-09-2025 12:59:39 AM

  1. విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
  2. వైస్ ఛాన్సలర్, విద్యా కమిషనర్‌తో కేటీఆర్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. వేములవాడలోని డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన సీరియస్‌గా తీసుకుని, తక్షణమే సమస్య పరిష్కా రానికి రంగంలోకి దిగారు.

ఈ అంశంపై కేటీఆర్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్‌లకు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా చూడాలని, త్వర గా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. అంతవరకే ప్రస్తుతం నడుస్తున్న తీరుగానే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కళాశాల అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవా లని ఆయన కోరారు.

పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను వెంటనే చెల్లించి, కళాశాలతో అవసరమైన ఒప్పందం చేసుకోవాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన సాంకేతిక విద్యా కమిషనర్, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్.. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లిస్తామని, విద్యార్థుల తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుండా చూ స్తామని హామీ ఇచ్చారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో 2021లో సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశారని, దీని కోసం రూ.402 కోట్లు కేటాయించారని కేటీఆర్ గుర్తుచేశారు.

మొదటి విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాలలో ప్రస్తుతం సుమారు 1032 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 700 మందికి హాస్టల్ వసతి కూడా కల్పించబడిందని తెలిపారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు వేములవాడలోని డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే, కళాశాల కమిషనర్ నుండి తాత్కాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రాకపోవడంతో, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తరగతి గదులకు తాళం వేసినట్లు పత్రికల్లో కథనాలు రావడంతో కేటీఆర్ స్పందించారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల బోధన, వసతి సమస్యలను పరిష్కరించడానికి జేఎన్టీయూ అధికారులు జులైలోనే కళాశాల కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ అంశంలో తగిన అనుమతులు, ఆదేశాలు స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇవ్వాలని ఆయన సూచించారు.