11-05-2025 12:09:17 AM
నేను కంపెనీలో చేరకముందు నుంచే మా పరిశోధన విభాగానికి హెడ్‌గా ఒక సీనియర్ మహిళ పనిచేసేవారు. ఇప్పటికీ ఉన్నారు. మా దగ్గర మహిళలు ఎక్కువకాలం పనిచేయడానికి ప్రధాన కారణం పనివేళలే. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి. దీనివల్ల కుటుంబం, ఉద్యోగం మధ్య సమన్వయం సాధ్యం అయ్యేది.
నదియా చౌహాన్,
జేఎండీ, పార్లే ఆగ్రో
మన గురించి తెలుసుకోవడానికి సంస్థలు ఇంటర్య్యూలు పెడతాయి అనుకుంటాం కదా! మనకు ఫలానా సంస్థ అనువైనదేనా అని తెలుసుకోవడానికి ఇది మార్గమే! ముఖ్యంగా అమ్మాయిలు రక్షణ గురించి తప్పక చూసుకోవాలి. కాబట్టి.. వీటిని గమనించుకోండి..
* ఏదైనా చెబుతుంటే పూర్తిగా వినకుండా మధ్యలో ఆపేయడం, ప్రశ్నలేవైనా అడిగితే పట్టించుకోకపోవడం లేదా సమాధానం ఇవ్వకపోవడం లాంటివి.. అమర్యాదకు చిహ్నాలు. భవిష్యత్తులోనూ అలా ఉండదని నమ్మకమేంటి? పోనీ ఈ దశలో అలాంటివేమీ కనిపించకపోయినా సంస్థలో మహిళలు నడిపిస్తున్న విభాగాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. సీనియర్ విభాగాల్లో మహిళలు లేరంటే ఎదుగుదల కష్టమనీ, సమానత్వం లేదనీ అర్థం చేసుకోవాలి.
* ఏ ప్రశ్నలు అడుగుతున్నారు? సబ్జెక్టు, కెరియర్, పరిశ్రమకు సంబంధించి ఏవైనా అడగొచ్చు. అవికాకుండా ఎంతసేపూ రిలేషన్‌లో ఉన్నారా? పిల్లలు పుడితే ఉద్యోగం మానేస్తారా? అంటూ కుటుంబానికి సంబంధించినవే అడుగుతుంటే మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇవి మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికే కాదు. మహిళల కెరియర్‌కు అంతగా ప్రాధాన్యమివ్వరన్న వాళ్ల ఆలోచనకి చిహ్నాలే. ఇది మీకు కొంచెం కష్టం, అబ్బాయిల పని మీవల్ల కాదు.. అంటూ మాట్లాడుతున్నా లింగ వివక్ష చూపిస్తున్నారని అర్థం.
* అమ్మాయిలకు ఇంటి బాధ్యతలూ ఉంటాయి. రక్షన గురించి చూసుకోవాలి. పనివేళలు, ఇంటి నుంచి పనిచేసే వీలు, అత్యవసర సెలవులు ఉంటాయి. వాటి గురించిన ప్రశ్నలు అడిగితే పట్టించుకోకపోయినా, వాటికి విలువ ఇవ్వకపోయినా మీ వ్యక్తిగత అవసరాలను పట్టించుకోనట్లే. ఆఫీసు అంటే రెండో ఇల్లు లాంటిదే. రోజులో ఎక్కువ సమయం గడిపేదీ అక్కడే. ఆ మాత్రం అండ కోరుకోవడం సహజం.
* మహిళలపై జోకులు, చిన్నచూపు, తరచూ ఆ సంస్థ నుంచి అమ్మాయిలు వెళ్లిపోతున్నా.. అమ్మాయిలకు అక్కడ రక్షణ, విలువ లేదనే అర్థం. పని ప్రదేశంలో గౌరవం దక్కాలి. ఎదిగే అవకాశం ఉండాలి. అవి లేనప్పుడు ఎంత అవసరమైనా అక్కడ చేరకపోవడమే మేలు. తర్వాత నిరాశ పడొద్దంటే ముందే గమనించుకోవాలి.