14-08-2024 12:05:00 AM
ఒక్కరోజులో రూ.1,040 పెరిగిన తులం ధర
హైదరాబాద్, ఆగస్టు 13: శ్రావణ మాసం వచ్చినంతనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.1,000పైగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పుత్తడి కొత్త రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 1,040 పెరిగి రూ.71,620 వద్దకు చేరింది. మూడు వారాల క్రితం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రూ.68,000 స్థాయికి దిగిన పుత్తడి తిరిగి పదేపదే రూ.70,000 స్థాయికి పెరిగి మళ్లీ తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఈ స్థాయితో పాటు రూ.71,000 స్థాయిని సైతం దాటేసింది.
తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 మేర పెరిగి రూ.65,650వద్దకు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,504 డాలర్ల రికార్డుస్థాయికి పెరిగిపోయింది. పపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా వెండి, బంగారాల ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు తెలిపారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి జరపవచ్చన్న భయాలతో సురక్షిత పెట్టుబడిగా పరిగణించే పుత్తడిలోకి ఇన్వెస్టర్లు నిధుల్ని మళ్లిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు.