21-09-2025 10:34:16 PM
మందమర్రి (విజయక్రాంతి): పువ్వులనే దేవతగా కొలిచి ఆడి పాడే పూల జాతర బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల మహిళలు ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహిళలు ఉపవాసం ఉండి ఇంటిల్లిపాది కలిసి గుమ్మడి పూలతో గౌరమ్మను ప్రతిష్టించిన అనంతరం తంగేడు, గునుగు, టేకు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజ మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ అందంగా తీర్చిన బతుకమ్మలను ఆడపడుచులు ప్రధాన కూడళ్లలో ఆలయాల వద్ద ప్రతిష్టించి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళల చప్పట్లు బతుకమ్మ పాటలతో పట్టణం గ్రామాలు మారు మోగాయి. అనంతరం సమీపం లోని వాగులు, చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ లలో బతుకమ్మలను సాంప్రదాయ బద్దంగా నిమజ్జనం చేశారు.