calender_icon.png 22 September, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికులకు లాభాల వాటాపై ప్రకటన

21-09-2025 10:21:08 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలలో కార్మికుల వాటా చెల్లింపు కోసం సోమవారం హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కోల్ బెల్టు ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు, ఈ సమావేశంలో సింగరేణి సంస్థ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై కార్మికుల వాటా చెల్లింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఆహ్వాన పత్రిక విడుదల చేసింది.

లాబాల వాట ప్రకటన కోసం కార్మికులు గత ఐదు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు లాభాల వాట కోసం కార్మిక సంఘాలు పోరాటాల బాట ఎంచుకోగా, సింగరేణిలో గుర్తింపు సంఘం లాభాల వాటా కోసం ఆందోళనలు చేపట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం  లాభాల వాటపై  ప్రకటన చేయనున్నట్లు కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఏదేమైనా దసరా పండుగ ముందు లాభాల వాటాపై స్పష్టత రానుండటంతో లాభాలను 35% తగ్గకుండా దసరా పండుగకు ముందే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలు, కోల్ బెల్ట్ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు.

న్యూఢిల్లీలో పిఎల్ఆర్ బోనస్ పై సమావేశం..

దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండుగ సందర్భంగా చెల్లించనున్న పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్ఆర్ బోనస్) పై కోలిండియా యజమాన్యం  జాతీయ కార్మిక సంఘాలతో న్యూఢిల్లీలో సోమవారం  సమావేశం కానుంది. దేశవ్యాప్త బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్  దసరా ముందు చెల్లించడం జరుగుతుంది. కొలిండియాలో 2024 -  25 ఆర్థిక సంవత్సరం లో సాధించిన లాభాల ఆధారంగా పిఎల్ఆర్ బోనస్ నిర్ణయించడం జరుగుతుంది. పిఎల్ఆర్ బోనస్ సమావేశంలో పాల్గొననున్న సింగరేణి యాజమాన్యం గత ఆర్థిక సంవత్సరం సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించిన అనంతరం 

పిఎల్ఆర్ బోనస్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండగా, తప్పనిసరి పరిస్థితిలో అత్యవసరంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో లాభాల వాటా చెల్లింపు పై సమావేశం నిర్వహించక తప్పని పరిస్థితి నెల కొనడంతో  రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించి లాబాల వాటా పై ప్రకటన చేయనుంది. ఇదిలా ఉండగా 2023 - 24 ఆర్థిక సంవత్సరం బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ 93750/ రూ చెల్లించగా, 2022 - 23 సం,,లో 85000/రూ, 2021 - 22 సం,,లో 76500/రూ చెల్లించారు. గడిచిన  మూడు సంవత్సరాలుగా కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ పెరుగుతూ వస్తుండడంతో ప్రస్తుత సంవత్సరం కూడా కార్మికులకు మరో 15 వేల నుండి 20వేల వరకు బోనస్ పెరుగుతుందని కార్మికులు, కార్మిక సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నేడు జరగనున్న రెండు కీలక సమావేశాల్లో బొగ్గు గని కార్మికులతో పాటు సింగరేణి కార్మికులకు పిఎల్ఆర్ బోనస్, లాభాల వాట పై ప్రకటన వెలువడ నుండగా లోపల వాటా, పిఎల్ఆర్ బోనస్ పెంపుపై కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.