calender_icon.png 27 October, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు దశాబ్దాల ఆమె సేవకు దక్కిన గౌరవం

27-10-2025 07:15:03 PM

గోలివాడ చంద్రకళకు మదర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో సత్కారం

గోదావరిఖని,(విజయక్రాంతి): తెలంగాణ మిత్ర మండలి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు గోలివాడ చంద్రకళ చేస్తున్న సమాజ సేవకు గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక మధర్ థెరిస్సా ప్రతిభా సేవారత్న అవార్డు వరించింది. ఈ మేరకు  అభినయ కల్చరల్ ఆర్ట్స్ 42వ వార్షికోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్సీఓఏ క్లబ్ లో జరుగుతున్న కళోత్సవాలలో చంద్రకళను నిర్వాహకులు మథర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు. మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థ ద్వారా చంద్రకళ పూట గడవని ఎంతోమంది నిరుపేదలు, నిస్సహాయులకు, అనారోగ్య బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ చేయూత అందించడమే గాకుండా నిరుపేద యువతుల వివాహాలను దగ్గరుండి జరిపించడం, పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు.

ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్రగా అనేక యేళ్లుగా పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేసి ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో ఆ వ్యాధి బారిన పడిన వారికి ఉచితంగా పోషకహారం, మందులను పంపిణీ చేశారు. ఆమె సేవలను గుర్తించి అభినయ కల్చరల్ సంస్థ అధ్యక్షులు రేణికుంట్ల రాజమౌళి మథర్ థెరిస్సా సేవా రత్న అవార్డుతో ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.

అవార్డు గ్రహీత చంద్రకళ మాట్లాడుతూ... ప్రముఖ సంఘ సేవకురాలు మధర్ థెరిస్సాను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో అలుపెరుగని ప్రయాణం చేస్తున్నాననీ,  ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య, రేణికుంట్ల సుశీల, సులోచన, తోపాటు పలువురు సీనియర్ కళాకారులు పాల్గొన్నారు. చంద్రకళ పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.