25-09-2025 12:41:45 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: జార్ఖండ్‌లో బుధవారం ఉదయం పోలీసులు, భద్ర తా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జేజేఎమ్‌పీ)తో సంబంధమున్న ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గుమ్లా జిల్లా పరిధిలోని బిషున్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కెచ్కి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో మృతిచెందిన వారిని లాలు లోహ్రా, చోటు ఒరాన్, సుజీత్ ఒరాన్‌గా గుర్తించారు.
ఇందులో లాలు లోహ్రా, చోటు ఒరాన్ జేజేఎంపీలో సబ్ జోనల్ కమాండర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి ఒక్కొక్కరి తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. సుజాత్ ఒరాన్ కూడా జేజేఎంపీలో భాగస్వామిగా ఉన్నాడు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు గుమ్లా పోలీలసులు నిర్ధారించారు.
లాలూ లోహ్ర వద్ద ఉన్న ఏకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల నక్కిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌తో ఈ నెలలోనే జేజేఎంపీ నుంచి మృతిచెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకు ముందు సెప్టెంబర్ 15న హజారీబాగ్ జిల్లా గోర్హార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే.
ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
చర్ల, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్న ద్రోహులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని.. బుధవారం విప్లవ పేరుతో మరో లేఖ విడుదల చేశారు. అమరుల త్యాగాలకు బదులు తీర్చుకుంటాము, విప్లవ పోరాటాలు కొనసాగిద్దామని పేర్కొన్నారు. అయితే, వారం రోజుల క్రితం వెలువడిన మావోయిస్టు లేఖకి బుధవారం వెలువడిన మావోయిస్టు లేఖకీ చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో విప్లవ పేరిట సంతకంతో మావోయిస్టు లేఖ విడుదలైతే సోమవారం విడుదలైన మావోయిస్టు లేఖ లచ్చన్న పేరు మీదుగా విడుదల కావడం గందరగోళానికి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.