3 May, 2026 | 3:24 PM

అసెంబ్లీకి రానివ్వకుండా సర్కార్ కుట్రలు

10-12-2024 12:49 AM
  1. మేమూ రాహుల్ పద్ధతినే అనుసరిస్తున్నాం
  2. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ బయటే ప్రతిపక్ష సభ్యులను అడ్డుకోవడం దారుణమన్నారు.

అసెంబ్లీ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని, తాము అదానీ, రేవంత్ ఉన్న టీ షర్ట్ వేసుకొని సభకొస్తే తప్పేంటని నిలదీశారు. ఏ దుస్తులు  వేసుకు రావాలనేది స్పీకర్ చెబుతారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ అదానీ దుర్మార్గాల మీదనే మాట్లాడుతున్నాడని.. తెలంగాణలో మాత్రం రేవంత్ అదానీకి మద్దతు పలుకుతున్నాడని విమర్శించారు.

రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమేనని రాహుల్‌గాంధీ అదానీ టీ షర్ట్ ధరిస్తే పార్లమెంట్‌లోకి అనుమతించారని, ఇక్కడ ఎందుకు రానివ్వరని నిలదీశారు. తాము రాహుల్ పద్ధతే అనుసరించామని, ఉభయసభలు స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ నడుపుతున్నారా? రేవంత్ నడుపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. 

రాహుల్ చేసింది ఒప్పు అయినప్పుడు తాము చేసింది తప్పని స్పీకర్, చైర్మన్ ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల కేంద్రం నుంచి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు.  రేవంత్ సమైక్యవాదుల బానిసని విమర్శించారు.

మా హక్కులను సర్కారు హరించింది: మధుసూదనాచారి

ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినమని.. సభలోకి రాకుండా తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి మండిపడ్డారు. స్పీకర్, చైర్మన్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకూ డదన్నారు. రేవంత్ పాలనలో అన్ని వ్యవస్థల హననం జరుగుతోందన్నారు.

రాష్ర్టంలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోందన్నారు. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారని.. ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.