విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి
సూర్యాపేట, జూన్ 15 (విజయక్రాంతి): భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తుందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతన కల్ జెడ్పీ హైస్కూల్‌లో ఆచార్య జయశంకర్ బడిబాటలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేవిధంగా పని చేస్తుందని చెప్పారు. అందుకోసం రూ.22 వేల కోట్లను కేటాయించిందన్నారు. దశలవారీగా రూ.600 కోట్లతో అన్ని పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ ప్రియాంక, పీడీ మధుసూదనరాజు, డీఈవో ఆశోక్, తదితరులు పాల్గొన్నారు.






