01-12-2025 02:00:56 PM
జర్నలిస్టుల న్యాయ హక్కులు బోనులో ఇక మౌనం లేదు
డిసెంబర్ 3న మాసాబ్‌ట్యాంక్ వద్ద మహా ధర్నాకు టీయూడబ్ల్యూజే సమగ్ర పిలుపు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
సంగారెడ్డి,(విజయక్రాంతి): జర్నలిస్టుల ప్రాథమిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీయూడబ్ల్యూజే (ఐ జేయు) నాయకులు ఆరోపించారు. అత్యవసరమైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ కలిసి మీడియాతో మాట్లాడుతూ... గత 20 నెలలుగా కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ పూర్తిగా నిలిచిపోయింది.
పాత కార్డులను మాత్రమే పలు దఫాలుగా రిన్యువల్ చేస్తూ ప్రభుత్వం వాయిదా విధానాన్ని కొనసాగిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. జర్నలిస్టుల కోసం కీలకమైన హెల్త్ కార్డులు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో, జర్నలిస్టుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని బండారు యాదగిరి తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, మంత్రులు, అధికారులతో చర్చించినా, ప్రభుత్వం స్పష్టమైన స్పందన ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణిలోనే వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ సాచివేత వైఖరికి నిరసనగా డిసెంబర్ 3న ఉదయం 10 గంటలకు, హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిందని తెలిపారు. మన ధర్మాగ్రహాన్ని ప్రభుత్వం గట్టిగా వినేలా చేయాలంటే ప్రతి జర్నలిస్టు ఈ ధర్నాలో తప్పకుండా పాల్గొనాలి అని టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి పిలుపునిచ్చారు. జిల్లాలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులు, సబ్ కమిటీ ప్రతినిధులు సహా ప్రతి జర్నలిస్టు ఈ ఆందోళనలో భాగస్వామ్యం కావాలని కోరారు.