calender_icon.png 26 July, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

24-06-2025 12:00:00 AM

  1. శిథిలమైన భవనాలు ప్రాణ భయంతో విధులు 
  2. వంద ఏళ్లు దాటినా పట్టింపేది? 

మహబూబాబాద్, జూన్ 23 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో 100 ఏళ్ల క్రితం నైజాం సర్కార్ కాలంలో నిర్మించిన పురాతన భవనాల్లోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. శిథిలమైన భవనాల్లో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 111 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనంలో జిల్లా పోస్టల్ కార్యాలయం నిర్వహిస్తున్నారు.

కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులతో పాటు నిత్యం వందల మంది పోస్టల్ సేవల కోసం వస్తుంటారు. కార్యాలయం సిద్ధనంగా మారడంతో పాటు ఇరుకుగా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే తరహాలో 99 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం తో పాటు పర్యవేక్షణ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. పైకప్పు దాదాపు శిథిలంగా మారి పెచ్చులూడుతూ కింద పడుతోంది.

అలాగే రెండు భవనాలు పూర్తిగా ఎప్పుడు కూలి పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో ఈ కార్యాలయంలో పనిచేసే అధికారులు ఉద్యోగులు నిత్యం ప్రాణభయంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఇదే తరహాలో మహబూబాబాద్ తహసిల్దార్ కార్యాలయం కూడా అనేక సంవత్సరాల క్రితం నిర్మించిన భవనంలోనే కొనసాగిస్తున్నారు. కార్యాలయం ఇరుకుగా మారడం, పాతకాలంనాటి పైకప్పు కావడంతో పెచ్చులూడి పడిపోతుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించే విభాగానికి ఇటీవల కొంత మరమ్మతులు చేసినప్పటికీ, కార్యాలయంలో ఉప తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్, రికార్డు రూము పూర్తిగా శిథిలం గా మారిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తహసిల్ కార్యాలయంగా మహబూబాబాద్ ఉన్నప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారినప్పటికీ తహసిల్దార్ కార్యాలయం రూపురేఖలు మారలేదని వాపోతున్నారు.

మహబూబాబాద్ జిల్లా గా ఏర్పడిన తర్వాత కొత్తగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ఇందులో వివిధ శాఖలకు ప్రత్యేకంగా కార్యాలయాలను కేటాయించారు. అయితే జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను శిథిలమైన భవనాల్లోనే కొనసాగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ స్పందించి జిల్లాలోని ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు సైతం కొత్త భవనాలను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.