3 July, 2026 | 1:21 AM

అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు

03-07-2026 12:26 AM

హనుమకొండ, జూలై 2 (విజయ క్రాంతి): అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని కంచరకుంట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు.

వారి ఆర్థిక పరిస్థితులు, నివాస స్థితిగతులు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవల అందుబాటు వంటి అంశాలపై స్వయంగా వివరాలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటన సందర్భంగా అనేక కుటుంబాలకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేక శిథిలావస్థలో నివసిస్తున్నారని,ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక చాలామంది వెనుకబడిపోయారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.

అలాగే అర్హులైన అనేక కుటుంబాలకు ఇప్పటికీ రేషన్ కార్డు దరఖాస్తులు చేసుకోకపోవడం , మరికొందరు అవగాహన లేక ఆసరా, వృద్ధాప్య, వితంతు తదితర సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో కంచరకుంట ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఇంటికి అధికారులు స్వయంగా వెళ్లి కుటుంబాల వివరాలు నమోదు చేయాలని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.