20-01-2026 12:00:00 AM
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ని లోపాలను సరిదిద్ది, పారదర్శకమైన భూ రికార్డుల నిర్వహణ కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూభారతి’ని ఎంతో ఆర్భాటం గా తీసుకువచ్చింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఈ కొత్త వ్యవస్థ కూడా పాత పద్ధతినే అనుసరిస్తుండడం ఇప్పుడు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాల్లో వెలుగుచూసిన చలాన్ల కుంభకోణం ఈ వ్యవస్థలోని సాంకేతిక లొసుగులను బట్టబయలు చేసిం ది. పేరు మార్చారు కానీ, అక్రమార్కులు చొరబడే మార్గాలను మాత్రం మూసివేయలేకపోయారనే విమర్శలు పెరిగిపోతున్నా యి. రెవెన్యూ వ్యవస్థలో నేడు జరుగుతున్న పరిణామాలు సామాన్య పౌరుడి నిద్రను హరించేవిగా మారాయి.
ఇది కేవలం ఒక సాంకేతిక లోపమని చెప్పి తప్పించుకునే పరిస్థితి కాదు. భూమి హక్కుల విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వ్యవస్థాగత దుర్వినియోగం, నిర్లక్ష్యం, అనుమానా స్పద చర్యల శ్రేణిగా ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడుతోంది. ఒకప్పుడు కళ్లముం దే కబ్జాలు జరిగేవి. నేడు కంప్యూటర్ తెర వెనుక జరిగే మార్పులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయన్న ఆందోళన సర్వ త్రా వ్యక్తమవుతోంది. డిజిటలైజేషన్ పేరుతో తీసుకొచ్చిన సంస్కరణలు పారదర్శకతను పెంచాల్సింది పోయి కొన్ని సందర్భాల్లో అక్రమాలకు కొత్త మార్గాలు తెరిచాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న నకిలీ..
రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 17 ఉద్దేశ్యాన్ని పక్కనపెట్టి, క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని వ్యవహా రాలు నడుస్తున్నాయన్న ఆరోపణలు తీవ్రమైనవే. చలానాల మార్పులు, అనుమానా స్పద పత్రాల వినియోగం వంటి చర్యలు భారతీయ న్యాయ సంహితలోని మోసం, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశముందని న్యాయ నిపు ణులు సూచిస్తున్నారు.
ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, చట్టపరమైన గంభీ ర పరిణామాలకు దారితీయగల అంశం. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితా అమలుపై కూ డా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూ ముల పరిరక్షణ పేరుతో కొందరు రైతుల పట్టా భూములను ఆ జాబితాలో చేర్చినట్లు వచ్చిన ఫిర్యాదులు రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును తీ వ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్న భావనకు దారి తీస్తున్నా యి.
నిబంధనలు ప్రజల రక్షణ కోసం ఉంటాయా, లేక వేధింపుల సాధనంగా మారాయా అన్న సందేహం తలెత్త డం వ్యవస్థకు సిగ్గుచేటు. చలానాల సవరణలు, రికార్డుల మార్పులపై అనేక ఫిర్యాదు లు రావడాన్ని తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం ఎంతమాత్రం కాదు. భూరికార్డులు పూర్తిగా భద్రమనే నమ్మకం సామాన్యుడిలో క్రమంగా క్షీణిస్తోంది. ఈరోజు నా పేరు ఉన్న భూమి, రేపు అలాగే ఉంటుందా? అన్న సం దేహం రైతు గుండెల్లో నాటుకుపోతోంది.
డిజిటల్ భద్రతకు ప్రమాదం..
డిజిటల్ భద్రత అంశం అత్యంత ఆందోళనకరం. సమాచార సాంకేతిక చట్టం2000 ప్రకారం ప్రభుత్వ దత్తాంశానికి కఠినమైన భద్రతా ప్రమాణాలు ఉండాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నియంత్రణలు బలహీనంగా ఉన్నాయన్న ఆరోపణలు వెలువడుతున్నా యి. అనధికారికంగా ప్రభుత్వ సర్వర్లలో మార్పులు జరిగితే, అది తీవ్రమైన సైబర్ నేరంగా పరిగణించబడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలాది రైతు ల వ్యక్తిగత వివరాలు, భూమి హక్కుల సమాచారం ప్రమాదంలో పడుతోందన్న భావనను ప్రభుత్వం తేలికగా విస్మరించలేదు.
తహసీల్దార్లు, రిజిస్ట్రేషన్ అధికారులు తమ బాధ్యతలను కేవలం సంతకాల వరకే పరిమితం చేయడం సరిపోదు. చలానాల చెల్లింపులు, డిజిటల్ ఎంట్రీలు, బ్యాంకు ధ్రు వీకరణలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సిన బాధ్యత ఉందన్న వాస్తవాన్ని విస్మ రించడం నేరపూరిత నిర్లక్ష్యంగా భావించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమగ్ర ఆడిట్ జరగకపోవడం వెనుక ఉన్న కారణాలపై కూడా లోతైన విచారణ అవసరం.
మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం కింది స్థాయి సిబ్బందిని బలికొట్టి చేతులు దులుపుకునే ధోరణిని వీడాల్సిన అవసరముంది. ఇది వ్యక్తుల సమస్య కాదు వ్యవస్థలోని లో పాలు. మోసాలకు మరిగిన అనుమానిత కుమ్మక్కులపై సమగ్ర న్యాయపరమైన తనిఖీలు చాలా అవసరం.
అక్రమ రిజిస్ట్రేషన్లను చట్టబద్ధంగా రద్దు చేయడం, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయడం, బ్యాంకు సర్వర్ ఆధారిత స్వయం ధ్రువీకరణ వ్యవస్థను అమలు చేయడం వం టి కఠిన నిర్ణయాల ద్వారానే ప్రజల్లో మసకబారిన నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చు. అ లా జరగకుంటే రేపు పొద్దున ఈ భూమి మీదేనా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
పర్యవేక్షణ లోపం..
ఇక భూభారతి వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్లను వా డుకుని నిందితులు ప్రభు త్వ ఖజానాకు కోట్లాది రూ పాయల గండి కొడుతున్నా రు. కేవలం సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఉన్న లోపాల వల్ల అక్ర మార్కులు చలాన్ల విలువను మార్చి, ప్రభుత్వానికి తక్కువ డబ్బు చెల్లిస్తూ రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియ స్‌గా తీసుకుని వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి, సమస్య బయటపడినప్పుడు మాత్రమే స్పందిస్తూ అండర్ ప్లే చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. లోపాలను ఆదిలోనే గుర్తించి అరికట్టడంలో ఐటీ విభాగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భూముల మార్పిడి, వారసత్వ సంక్రమణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పుల సవరణ వంటి అంశాల్లో భూభారతి ఇంకా వేగం పుంజుకోలేదు. స్లాట్ బుకింగ్ దొరకకపోవడం, డాక్యుమెంట్లు అప్‌లోడ్ కాకపోవ డం వంటి సాంకేతిక సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ధరణిలో ఉన్న సమస్యలే భూభారతిలోనూ కొనసాగుతుండడం తో, దీనివల్ల మాకు ఒరిగిందేమిటన్న ధోరణి రైతుల్లో పెరిగిపోవడంతో పాటు న్యాయం ఎప్పుడు జరుగుతుందంటూ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపించడం వల్ల మధ్యవర్తులు మళ్లీ రంగప్రవేశం చేసి రైతులను నిలువునా దోచుకుంటున్నారు.
అక్రమార్కులకు అడ్డా!
గత ఎన్నికల్లో ధరణిలో కనిపించిన సమస్యలను గాలికి వదిలేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ఆ వ్యతిరేకతను అంచ నా వేయలేక బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఓటమిపాలై భారీ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ వచ్చాకా ధరణి స్థానం లో తీసుకొచ్చిన భూభారతి కూడా అదే బాటలో నడుస్తుండడం బాధాకరం. భూ ములకు సంబంధించి భూభారతికి వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భూమి అనేది సగటు మనిషికి అత్యంత సెంటిమెంట్, ఆర్థిక మూ లాధారం. అక్కడ చిన్న తప్పు జరిగినా అది పాలనపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తుంది. భూభారతి పట్ల పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం సకాలంలో గుర్తించకపోతే, అది రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి చే దు అనుభవాలను మిగిల్చే అవకాశముంది.
అసలు ఇలాంటి స్కాములు ఎందుకు జరుగుతున్నాయనేది ఆలోచించాల్సిన అవ సరముంది. వ్యవస్థలో పారదర్శకత ఎక్కడ లోపిస్తోంది? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక పోర్టల్‌ను మార్చి వేరే పేరుతో మరొకటి తీసుకురావడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఏదైనా పటిష్టమైన భద్రతతో, సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండాలి. అధికారులు, ఐటీ నిపుణులు నిరంతరం పర్యవేక్షించని పక్షంలో ఏ వ్యవస్థ అయినా అక్రమార్కులకు అడ్డాగా మారుతుందన్న ఆందోళన పెరిగిపోతున్నది.
వ్యాసకర్త సెల్: 9640466464