01-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): యాసంగి సీజన్లో సాగుచేసిన వరి పంట దిగుబడి ఇచ్చిన ధాన్యాన్ని విక్రయించడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు ప్రభుత్వం బోనస్ ప్రకటించగా, బోనస్ పొందడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక బోనస్ లేకున్నా పరవాలేదు.. పండించిన పంటను వెంటనే విక్రయించేందుకు మార్కెట్ కు వెళితే కనీస మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం క్వింటాలుకు 2,320 రూపాయలతో పాటు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్తే కనీసం వారం నుండి పక్షం రోజులపాటు నిరీక్షించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక ఇంత తిప్పలు పడేది ఎందుకు అని మార్కెట్ కు వెళితే క్వింటాలుకు 2000 నుండి 2200 రూపాయలకు మించి వ్యాపారులు ధర పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళితే తిప్పలు పడాల్సి వస్తోందని, అదే మార్కెట్ కు వెళితే కనీసం మద్దతు ధర లభించక క్వింటాల్ కు 100 నుండి 200 రూపాయలు ధర కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 1,19,226 ఎకరాల్లో వరి సాగు చేయగా, గరిష్టంగా ఎకరానికి సగటున 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా, అకాల వర్షాలకు పంట నష్టపోయి 10 నుండి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి.
జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 200లకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయానికి పక్షం రోజులుగా తెస్తున్నారు. అయితే ఎక్కువగా రైతులు హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు చేసి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని, దీంతో తేమశాతం 40 నుంచి 45 శాతం వరకు ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతానికి మించి తేమ ఉంటే కొనుగోలు చేయకూడదని ఆదేశాలు ఉన్నాయి.
దీనితో దాన్యంలో తేమ శాతం తగ్గేంత వరకు కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్కెట్ కు విక్రయానికి తెస్తే ఇక్కడ కూడా తేమ ‘తకరారు’తో వ్యాపారులు అమాంతం ధర తగ్గించి కొంటున్నారని రైతులు చెబుతున్నారు.
ఇప్పటికే అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి ఆశించిన మేర లభించక నష్టపోతున్న రైతులకు చేతి కందిన కొద్దిపాటి ధాన్యానికి ఆశించిన ధర లభించకపోవడంతో ఇంత కష్టపడి పండిస్తే ఏం లాభం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వానకు తడుసుడు.. ఎండకు ఎండుడు!
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు వ్యవసాయ మార్కెట్లలో విక్రయానికి తెచ్చిన ధాన్యం బాగా ఆరబెట్టి ఇక కాంటాలు పెట్టే సమయానికి కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిపోతున్నాయి. దీనితో తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టి విక్రయించడానికి రోజుల తరబడి దాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లోనే రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో నెలకొంది.
గత ఆదివారం వర్షం కురవడంతో తడిసిన ధాన్యాన్ని రెండు రోజులపాటు ఆరబెట్టగా మళ్లీ బుధవారం జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షానికి ధాన్యం మళ్లీ తడిసి పోయింది. దీంతో ఎండకు ఎండుడు.. వానకు తడుసుడు అన్న తీరుగా ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎదురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు వాన ముంచింది, ఇటు ధర దక్కలేదు
మూడు ఎకరాల్లో యాసంగి సీజన్లో సన్న వరి సాగు చేశాను. పం ట ఏపుగా పెరిగింది. దిగుబడి బాగా వస్తుందని ఆశలు పెట్టుకు న్నా. తీరా ఇటీవల అకాల వర్షంతో పంట చాలా వరకు నేల వాలింది. దీనితో వడ్లు నేల రాలిపోయాయి. దిగుబడి సగానికి స గం పడిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్తే పది రోజులపాటు ఉండాల్సి వస్తోంది. దీనితో చేసేదేమీ లేక మార్కెట్ కు ధాన్యాన్ని విక్రయించేందుకు తెచ్చాను.
ఇక్క డ కనీసం ప్రభుత్వం ఇచ్చే ధర కూడా ఇవ్వకుండా క్వింటాలుకు 2000 నుంచి 2200 రూపాయల ధర పెడుతున్నారు. దీనితో అటు దిగుబడి, ఇటు ధర లభించక యాసం గి వరి పంట నాకు నష్టమే మిగిల్చింది.
ధరావత్ యాకూబ్, రైతు, కేసముద్రం