7 April, 2026 | 2:55 AM

మానుకోట జిల్లాలో 204 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

07-04-2026 01:04 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి):2025-26 యాసంగి సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లావ్యాప్తంగా 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరిష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, సంబంధిత అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లతో రబీ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్లో సుమారు 2 లక్షల 60 వేల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అందుకు తగిన విధంగా జిల్లా యంత్రాంగం అన్ని విభాగాలు డిఆర్డిఏ, ఐకెపి, సహకార, వ్యవసాయ, రెవెన్యూ పోలీస్, మెప్మా, గిరిజన కార్పొరేషన్ అధికారులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో కొనుగోళ్లను నిర్వహించడం జరుగుతుందన్నారు.

వచ్చే వారం నుండి జిల్లాలో కొనుగోలను ప్రారంభించడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, టెంట్, టాయిలెట్, చైర్స్, వైద్య శిబిరాలు, కల్పించడం జరుగుతుందని, జిల్లాలో డిమాండ్ కు అనుగుణంగా గన్ని సంచులు, టార్పాలిన్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడి క్లీనర్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, 

 జిల్లాలో సీఎంఆర్ డెలివరీ లక్ష్యాలను వెంటనే పూర్తి చేయుటకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డీఎస్‌ఓ రమేష్, డీఎం సివిల్ సప్లై నరసింహారావు, మార్కెటింగ్ డిఎం వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏడిఏ మురళి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, మెప్మా ప్రాజెక్ట్ అధికారినీ విజయ, అన్ని విభాగాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.