30-09-2025 06:45:24 PM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి..
నిజామాబాద్ (విజయక్రాంతి): ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్సు హాల్ లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముందస్తుగా పంట వేసిన ప్రాంతాలలో దిగుబడులు వస్తున్న దృష్ట్యా అక్టోబర్ 5వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాలలో పంట దిగుబడులు చేతికి అందే సమయానికి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండే రీతిలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని, టార్పాలిన్లు, హమాలీలు, తూకం యంత్రాలు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడా సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటదివెంట జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జె.గోవిందు, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.