30-09-2025 06:43:15 PM
హుజురాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తాం..
రైతుకు యూరియా బస్తాలు అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత లేదు..
జర్నలిస్టుల నివేషణ స్థలాలు అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): బాకీ కార్డుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి, రాబోయే అన్ని ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదన పెట్టారని, బిసి రిజర్వేషన్కు తమ సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థికి తాను పూర్తిస్థాయి అండగా ఉండి గెలిపించుకుంటానని అన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ లోని 107 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలను వందల కోట్లు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దారని, హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతులని వారికి ఏ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో తెలుసని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు. కెసిఆర్ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నడిరోడ్డుపై నిలబెట్టిందన్నారు. రైతులకు కనీసం యూరియా బస్తాలు అందించని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కూడా లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన నియోజకవర్గానికి బాకీ ఉన్న మొత్తాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న బాకీ కార్డును కూడా ప్రజలకు అందిస్తామన్నారు. హుజురాబాద్ జర్నలిస్టులకు ఇచ్చిన నివేషణ స్థలాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.