31-10-2025 12:00:00 AM
 
							-వర్షంతో మొలకెత్తిన ధాన్యం
-ఆందోళనలో రైతులు
బిచ్కుంద, అక్టోబర్ 30(విజయ క్రాంతి): మొంథా తుఫాను ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జుక్కల్ నియోజకవర్గ రైతులను నష్టాల్లో ముంచాయి. ధాన్యం తడిసి పోవడంతోపాటు మొలకలెత్యాయి. వర్షానికి తడవకుండా వారి ధాన్యం కాపాడుకోవడానికి అన్నదాతలు పరుగులు పెట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎల్లారం, దడ్గి, సీతారాంపల్లి, శాంతాపూర్, వాజిద్ నగర్, పుల్కల్, హస్గుల్, శట్లూర్ మొదలగు గ్రామాల వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అకాల వర్షం వల్ల ఆరపెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ధాన్యం నాణ్యత తగ్గి నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండిం చిన పంట అకాల వర్షంతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కొట్టుమిట్టాడుతు న్నారు. తేమశాతం చూడకుండానే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.