31-10-2025 08:28:24 AM
 
							బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లో సింగరేణి సీఎంవో కిరణ్ రాజ్(Singareni CMO Kiran Raj) ఆకస్మికంగా పర్యటించారు. అందులో భాగంగా తొలుత బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి నీ తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఆయనకు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎం పాండు రంగచారి, వైద్యులు స్వాగతం పలికారు. డీవైసీఎం ఛాంబర్ లో వైద్య సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల కొరత, వైద్య నైపుణ్యల సేవలపై సీఎంవో కు విన్నవించారు.
అన్నిరకాల వైద్య సేవలు కృషి..
బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానన్నారు. వైద్య సేవలను తెలుసుకునేందుకు ఆస్పత్రిని విజిట్ చేసినట్లు చెప్పారు. సమస్యలేంటి ముందు తెలియాలి కదా అని తెలిపారు. వైద్య నిపుణుల కొరతను దశల వారీ గా తీర్చి, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నూతన వైద్యుల రిక్రూట్మెంట్ జరుగుతోందని తెలిపారు. ఆ పరంగా 32 వైద్యులు కొత్తగా వస్తున్నారని, అందులో నుంచి ఇద్దరు వైద్యులను బెల్లంపల్లి ఆస్పత్రికి కేటాయిస్తారని తెలిపారు. జనరల్ సర్జన్, ఫిజిషియన్ వైద్య నిపుణుల అవసరం బెల్లంపల్లిలో ఉందని చెప్పారు.
అప్పటివరకు కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పర్మినెంట్ వైద్యులు వచ్చే వరకూ డిప్యూటేషన్ పై అవసరమైన వైద్యు సదుపాయాలకి కృషి చేస్తానన్నారు.ఇతర ప్రాంతాల నుంచి వారానికోసారి కన్సల్టింగ్ వైద్యు నిపుణులను రప్పిస్తానన్నారు. ఏ రకంగానూ కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు లోటు లేకుండా అందించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రి పై కొంత పట్టింపు తక్కువ ఉండేదని, ఇప్పుడు అలా కాదని స్పష్టం చేశారు. కచ్చితంగా కార్మిక కుటుంబాలకు యజమాన్యం అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తుందన్నారు. అందుకు సింగరేణి సీఎండీ బలరాం, సింగరేణి డైరెక్టర్లు వైద్య సంక్షేమానికి తగిన చేయూతని అందిస్తున్నారన్నారు. ఆయన వెంట బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎం పాండు రంగచారి, వైద్యులు ఉన్నారు.