calender_icon.png 31 October, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్రవదులుతున్న సమాచారహక్కు!

31-10-2025 01:47:25 AM

రాష్ట్రంలో11 ఏండ్లలో తొలిసారిగా జరిమానా వేసిన కమిషనర్

ఇన్నెళ్లు ఎన్ని దరఖాస్తులు పెట్టినా.. లభించని సమాచారం

కనీసం వార్షిక నివేదికలు తయారుచేయని సమాచార హక్కు కమిషన్ కార్యాలయం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలో సమాచారం హక్కు చట్టం నిద్రపోతోంది. అవును నిజం.. గడిచిన పదకొండేండ్లుగా సుప్తావస్థలో ఉన్న సమాచార హక్కు కమిషన్ పూర్తి స్థాయిలో కమిషనర్లను నియమించినప్పటికీ.. ఇంకా నిద్రమత్తు నుంచి బయటకు వస్తున్న సంకేతాలు కనపడటం లేదు. అయితే రెండు అప్పీళ్ల విషయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన అధికారికి దశాబ్దకాలం తరువాత కమిషన్ జరిమానా వేయడం మాత్రం శుభ పరిణామం అని ఆర్‌టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) యాక్టివిస్టులు అభిప్రాయపడుతున్నారు.

పదేళ్ల తరువాత జరిమానాలు

పదేళ్ల తరువాత ఆర్‌టీఐ చట్టం కింద ఇద్దరు అధికారులకు జరిమానా విధించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీఐ యాక్టివిస్టులకు, స్వచ్ఛంద సంస్థలకు ఒకింత ఆనందం కలిగించేదిగానే చెప్పవచ్చు. తాజాగా రెండు అప్పీళ్లలో.. దరకాస్తుదారులు కోరిన సమాచారం అందివ్వనందుకు సమాచార హక్కు కమిషనర్ పీవీ శ్రీనివాసరావు విచారించి ఒక అధికారికి రూ. 5 వేలు, మరో అధికారికి రూ. 2 వేల చొప్పున జరిమానా విధించడం గమనార్హం. 2014 తరువాత తాజా సంఘటన వరకు సమాచారం ఇవ్వనందుకు అధికారులకు జరిమానా విధించిన సంఘటనలు లేవంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.

పదేళ్లుగా నిద్రమత్తులో..

2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత వరకు.. ఆపై 2014 చివరి వరకు (ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా) ఆర్‌టీఐ హక్కు చట్టం పరిధిలో జరిగిన కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వెబ్‌సైట్‌లో వార్షిక నివేదికల రూపంలో వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు ఆర్‌టీఐ కమిషన్ పరిధిలో ఏయే కార్యకలాపాలు జరిగా యి.. ఎన్ని అప్పీళ్లు వచ్చాయి.. అందులో ఎన్ని అప్పీళ్లు పరిష్కరించారు.. ఇంకెన్ని మిగిలి ఉన్నాయనే సమాచారం కమిషన్ వెబ్‌సైట్‌లో మచ్చుకైనా కనిపించదు.

ప్రతి యేటా వార్షిక నివేదికలను సిద్ధంచేసి శాసనసభ ముందు ఉంచాల్సి ఉన్నా.. గడిచిన పదేండ్లుగా ఆ దాఖలాలు కనపడటం లేదు. అంటే గడిచిన పదేండ్లుగా సమాచార హక్కు కమిషన్ నిద్రమత్తులో ఉందనే విషయం చెప్పక తప్పని పరిస్థితి కనపడుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీఐ చీఫ్ కమిషనర్, ఇతర కమిషనర్లను నియమించిన ప్రభుత్వం.. అంతటితో వదిలేసింది.

అప్పుడే 2014 వార్షిక నివేదికను రూపొందించిన ఆర్టీఐ కమిషనర్ కార్యాలయం అటుతరువాత వార్షిక నివేదికలను తయారు చేయ లేదు. అసలు కమిషనర్లు ఏ స్థాయిలో పనిచేశారనేదికూడా బయటకు రాలేదు. ఇప్పు డుకూడా సమాచార హక్కు కమిషన్ వెబ్‌సైట్‌లో 2014 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే సూటిగా చెప్పాలంటే గడిచిన దశాబ్దకాలంగా నివేదికలు సిద్ధంకూడా చేయలేదంటే.. నిద్రమత్తు కాకుంటే మరేమిటని యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.

గత ప్రభుత్వం మాదిరిగానేనా..?

గడిచిన పదేండ్లలో గత ప్రభుత్వం పరిపాలనలో సమాచార హక్కు కమిషన్ పనితీరు ఎలా నిద్రావస్థలో ఉందో.. ఇప్పుడుకూడా అదే దారిలో పయనిస్తుందా అనే ప్రశ్నకూడా ఆర్‌టీఐ యాక్టివిస్టులు లేవనెత్తుతున్నారు. అయితే తాజాగా సమాచారం ఇవ్వనందుకు ఇద్దరు అధికారులకు జరిమానా విధించడంతో.. కనీసం నిద్రమత్తు నుంచి బయట పడుతున్న ఛాయలు కనపడుతున్నాయని, అసలు అప్పీళ్లను వేగంగా పరిష్కరించాలని, పూర్తి నిర్లక్ష్యంతో ఉన్న అధికారులపై జరిమానా, శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు ఇస్తే.. తిరిగి ప్రజలు, స్వచ్చంద సంస్థ లు, ఆర్‌టీఐ యాక్టివిస్టుల్లో నమ్మకం కలుగుతుందని వారంటున్నారు.

పైగా ఇప్పటికికూడా స్థానికంగా ఇచ్చే ప్రాథమిక సమాచారంకూడా ఇవ్వకుండా అధికారులు తాత్సా రం చేస్తున్నారనేది వాస్తవం. అలాగే మొదటి అప్పీళ్లను విచారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే.. కమిషన్‌కు రెం డో అప్పీలుగా వెళ్లాల్సి వస్తుందని యాక్టివిస్టులు అంటున్నారు. పైగా గతంలో కమిషనర్లు ఇచ్చి న ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తిరిగి కమిషన్‌నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలాంటి అప్పీళ్లు కమిషన్ వద్ద సుమారు 500 వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది.

జీవోల సంగతేంటి..

ప్రజా ప్రభుత్వం హయాంలోనైనా సమాచార హక్కు చట్టానికి మరోసారి జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో)లలో కేవలం 40 నుంచి 50శాతం వరకే పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నారని.. మిగిలిన జీవోలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే అపవాదు ఉండనే ఉంది. జీవోలను రహస్యంగా ఉంచడం అనేది గత ప్రభుత్వ హయాంలో మొదలయ్యింది. ఇప్పటికీ అదే పద్ధతిలో జీవోను రహస్యంగా ఉంచడం అనేది సరైంది కాదని యాక్టివిస్టులు అంటున్నారు. 

రాష్ట్రంలో పెండింగులో ఉన్న సమాచార హక్కు చట్టం దరకాస్తుల వివరాలు..

* సంవత్సరం - కేటగిరీ - పెండింగులో ఉన్నవి-కొత్తగా వచ్చిన దరకాస్తులు - మొత్తం - పరిష్కరించినవి - మిగిలినవి (పెండింగ్) 2014 (1.1.2014 నాటికి) - రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో - 9735 - 67,499 - 77,234 - 69,441 - 7,793 2014 (31.12.2014 నాటికి) - ఆర్‌టీఐ కమిషన్ కార్యాలయం - 12,611 - 36,897 -49,508 - 40,271 - 9,237

* 2025 (అక్టోబర్ నాటికి) - ఆర్‌టీఐ కమిషన్ కార్యాలయం - 17,720 (2025 మే నాటికి) - 2300 - 20000 - 5200 - 15000

* అధికారికంగా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేనందున.. వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అందించిన అంచనా గణాంకాలు.

శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తేనే కదలిక 

గడిచిన పదేళ్ల కాలంలో సమాచారం హక్కు చట్టం కమిషన్ రాష్ట్రంలో ఎలాంటి కదలి కలు లేకుండా నిద్రమత్తులో ఉండిపోయింది. వేలాది దరకాస్తులు, అదేస్థాయిలో అప్పీళ్లుకూడా పెం డింగులోనే ఉండిపోయాయి. సమాచారం ఇవ్వని అధికారికి జరిమానా విధించడం అనేది పదేళ్ల తరువాత విన్నాం. ఆర్టీఐ కార్యకర్తగా చాలా సంతో షం. 2014కు ముందు ఆర్టీఐ కమిషన్ ఏ స్థాయిలో పనిచేసిందో.. ఆస్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

అయితే 2 వేలు, 5 వేలు అనే జరిమానా అనేది అధికారులపై అంతగా ప్రభావం చూపవు.. శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తేనే కదలిక వస్తుంది. అప్పుడే చట్టం ఆశయాలు నెరవేరుతాయి.. ప్రజలకు సమాచారం అందు బాటులో ఉంటుంది. న్యాయం దక్కుతుంది.. పారదర్శకత ప్రతిఫలిస్తుంది.

 సుంకరి ప్రశాంత్,

ఆర్‌టీఐ యాక్టివిస్ట్,

లోక్‌సత్తా ఉద్యమ సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు